కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి కొత్త ప్రతిపాదనతో సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన స్థానంలో ఓ సామాన్య కార్యకర్తలకు చాన్సిస్తానని ప్రకటించారు. కార్యకర్తలు అంగీకరించకపోతే.. తన భార్య నిర్మలను పోటీకి పెడతాను కానీ తాను మాత్రం పోటీ చేయనన్నారు. మరి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా అంటే అదేమీ లేదని.. మళ్లీ 2028 ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు.
ఈ ఒక్క సారికి మాత్రమే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతెత్తారు. చాలా సార్లు ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లోనూ జగ్గారెడ్డి వ్యవహారంపై చర్చ జరుగుతోంది.
జగ్గారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయను అనే ప్రకటన రాజకీయం మాత్రమేనని… ఆయన అనుచరులు కూడా అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ మరో ఆలోచన లేకుండా తననే పోటీ చేయమని అడిగేలా చేయడమే ఈ వ్యూహమని అంటున్నారు. ఇటీవల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో చురుకుగా తిరుగుతున్నారు. ఆయన భార్య నిర్మలా.. పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పుడు ఆమెను ఎమ్మెల్యే చేయాలని జగ్గారెడ్డి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.