తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదో ఓ చిచ్చు పెట్టకపోతే జగ్గారెడ్డికి మనసు ప్రశాంతంగా ఉండదు. తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మనం ఎందుకు మద్దతు ప్రకటించలేదని ఆయన మీడియా ముందు కాంగ్రెస్ పార్టీపై చెలరేగిపోయారు. అయితే ఈ తప్పు రేవంత్ రెడ్డి మీద వేయకుండా వ్యూహాత్మకంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కపై వేశారు. ఆయనే తప్పు చేశారని ఓ లేఖ కూడా ిడుదల చేశారు. కానీ జగ్గారెడ్డి రాజకీయం తెలుసుకోలేనంత అమాయకంగా కాంగ్రెస్ నేతలు లేరు.
చివరి క్షణంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. కేసీఆర్ తో కలిసిన తరువాత తమను కలుస్తున్నారని.. తాము అందుకు అంగీకరించేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ నాయకత్వానికి స్పష్టం చేశామని రేవంత్ వెల్లడించారు. ఈ విషయం పార్టీలో అందరికీ తెలుసు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించినా తెలంగాణలో కలవకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డేనని జగ్గారెడ్డికి తెలుసని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
జగ్గారెడ్డి అసంతృప్తి అంతా రేవంత్ రెడ్డిపైనేనని.. అయితే గతంలో రేవంత్ పై పలుమార్లు విమర్శలు చేసిన అంశం మిస్ ఫైర్ కావడంతో ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క పేరు చెప్పి రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయినా జగ్గారెడ్డి మాత్రం భట్టి భుజాలపై నుంచి మరోసారి రేవంత్ రెడ్డిపై గురి పెట్టారు. నిజానికి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించడంలో ఆయనను ఇదే రోజు తెలంగాణకు రప్పించడంలో టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహంలో చిక్కుకుపోవడం ఇష్టం లేక కాంగ్రెస్ నేతలు కూడా సిన్హాను పట్టించుకోకూడదనుకున్నారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఇదే సందు అనుకుని తన రాజకీయం తాను ప్రారంభించారు .