హైదరాబాద్: భారతీయ జనతాపార్టీనుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరి సమక్షంలో ఆర్భాటంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగ్గారెడ్డి, నాడు తనకు చంద్రబాబు ఫోన్ చేసి, బీజేపీలో చేరితే భవిష్యత్తు ఉంటుందని చెప్పటంవలనే తాను తొందరపడ్డానని చెప్పుకొచ్చారు. మరోవైపు – తాను బీజేపీలో ఎందుకు చేరానో తనకే తెలియదని, ఆ సమయంలో ఏవేవో ఆలోచనలతో ఆ పార్టీలో చేరాననికూడా జగ్గారెడ్డి చెప్పారు. తన నోటి దురుసుతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని, ఉద్యోగులు అధికారపార్టీకి దూరమవటంకూడా తన ఓటమికి కారణమయిందని అన్నారు. తదుపరి ఎన్నికల్లో సంగారెడ్డిలో గడిచితీరుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో మంత్రులు అడుగుపెట్టటానికే భయపడేటట్లు చేస్తానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత 800మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగ్గారెడ్డి అనుచరులు జనాన్ని పెద్ద ఎత్తున తరలించారు. అయినా, చంద్రబాబు ఒక వేళ చేరమని చెబితే – గిబితే తమ పార్టీ తెలుగుదేశంలో చేరమంటారుగానీ బీజేపీలో ఎందుకు చేరమంటారన్నది ఇప్పుడు అందరికీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. చంద్రబాబును జగ్గారెడ్డి వివాదంలోకి ఎందుకు లాగారో టీడీపీ నేతలే చెప్పాలి.