రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించాలనుకున్న సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ రవితేజ దగ్గర నుండి కింగ్ నాగార్జున చేతిలోకి వచ్చిందని అంటున్నారు. అంతేకాదు త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో రవితేజ హీరో అనుకున్నప్పుడే ప్రతి నాయకుడిగా జగపతి బాబుని అనుకున్నారట.
ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన జగపతి రీ ఎంట్రీతో విలన్ గా మారి విభిన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. అంతేకాదు రిచ్ ఫాదర్.. రిచ్ విలన్ గా జగ్గు భాయ్ అదరగొట్టేస్తున్నాడు. ఇక దిల్ రాజు సినిమా నాగార్జున చేస్తున్నాడు కాబట్టి నాగ్ కు విలన్ గా మారబోతున్నాడు జగపతిబాబు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇదే కనుక ఓకే అయితే మరో భారీ మల్టీస్టారర్ మనం చూడొచ్చన్నమాట.
ఈ మధ్యనే సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి హిట్ కొట్టిన నాగార్జున ఆ సినిమా హిట్ జోష్ మీద ఉన్నాడు. ఇక కార్తితో నటిస్తున్న మల్టీస్టారర్ ‘ఊపిరి’ కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఊపిరి సినిమా మార్చ్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.