శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఎప్పుడు? చాలామంది మదిలో ప్రశ్న ఇది. చాలామంది దర్శక నిర్మాతలు జాన్వీని తెలుగులో కి తీసుకొద్దామని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు మైత్రీ మూవీస్ రంగంలోకి దిగింది. మైత్రీ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ముఖ్యంగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీ సెట్ చేసింది వాళ్లే. ఆ సినిమా కోసమే జాన్వీని సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. బోనీకపూర్ తో మైత్రీ మూవీస్ నిర్మాతలు ఇప్పుడు టచ్లోకి వెళ్లారని సమాచారం.
ఎన్టీఆర్ సినిమా, పైగా ప్రశాంత్ నీల్ దర్శకుడు, అందులోనూ.. పాన్ ఇండియా ప్రాజెక్టు… ఇంతకంటే జాన్వీకి తెలుగులో గొప్ప ఎంట్రీ ఏముంటుంది? కాకపోతే.. బోనీ తన నిర్ణయాన్ని వెల్లడించడంలో తాత్సారం చేస్తున్నాడట. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, హీరోయిన్ ఎంపికపై అప్పుడే హంగామా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే.. డెబ్యూ తమ సినిమాతోనే చేయించాలన్నది మైత్రీ మూవీస్ ఆకాంక్ష. అందుకే ముందే కర్చీఫ్ రెడీ చేసుకుంటున్నట్టు భోగటా. అయినా.. తెలుగు చిత్రసీమ `జాన్వీ.. జాన్వీ` అంటూ పలవరించడమే గానీ, జాన్వీకి తెలుగులో సినిమా చేయాలన్న కోరిక పెద్దగా లేదనిపిస్తోంది. లేదంటే ఇన్ని ఆఫర్లకు నో చెబుతుందా? ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?