తెలుగులో ‘దేవర’తో ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. టీజర్ ఏం బయటకు రాకపోయినా… ఈ సినిమాతో జాన్వీ మ్యాజిక్ చేస్తుందని అంతా నమ్ముతున్నారు. ఒక్కటంటే ఒక్క ఫస్ట్ లుక్ తో.. జాన్వీ అందరినీ ఫిదా చేసేసింది. ఇప్పుడు మరో సౌత్ సినిమాని తన ఖాతాలో వేసుకొంది. త్వరలోనే సూర్యతో జాన్వీ జట్టు కట్టబోతోందని సమాచారం. సూర్య కథానాయకుడిగా ఓం ప్రకాశ్ మిశ్రా దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో జాన్వీని కథానాయికగా ఎంచుకొన్నారని తెలుస్తోంది. జాన్వీతో చిత్రబృందం సంప్రదింపులు మొదలెట్టింది. తను ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకోవడానికి సముఖంగా ఉందని సమాచారం.
‘తుఫాన్’, ‘ఢిల్లీ 6’, ‘రంగ్ దే బసంతీ’ లాంటి ఎన్నో మంచి సినిమాల్ని అందించారు ఓం ప్రకాశ్. ఇప్పుడు సూర్య కోసం ఓ కథ రెడీ చేశారు. సూర్యతో.. కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాతే… ఈ సినిమా పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో, ఓ వినూత్నమైన బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కబోతోందని టాక్. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.