భారత్ సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. డ్రాగన్ చైనాను వెనక్కి నెట్టే శక్తి మనకు మాత్రమే ఉందని ఇంకోసారి రుజువైంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మరోసారి ఖ్యాతి పొందింది. అధికారికంగా, గణాంకాల ఆధారంగా ఇప్పుడు వృద్ధి రేటులో ప్రపంచం మొత్తం మీద మనమే నంబర్ వన్.
మొన్న మార్చి31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.6 శాతం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. చివరి త్రైమాసికంలో భారత్ 7.9 వృద్ధిరేటును సాధించింది. 2014-15లోనూ భారత్ 7.5 శాతం రేటు సాధించి చైనాను అధిగమించింది. ఈసారి కూడా డ్రాగన్ దేశాన్ని వెనక్కి నెట్టేసింది.
అధికారంలోకి వచ్చి రెండేళ్ల పండగ చేసుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది పెద్ద శుభవార్త. మోడీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని విమర్శించే ప్రతిపక్షాలకు గట్టిగా జవాబు చెప్పడానికి బ్రహ్మాస్త్రం లభించినట్టయింది.
సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 7.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు 7.2 గా నమోదైంది. ఈ స్థాయి గణాంకాలు నమోదు కావడానికి కారణం తయారీ రంగం, వ్యవసాయ రంగాలు మెరుగైన ఫలితాలను నమోదు చేయడం. తయారీ రంగం 9.3 శాతం, వ్యవసాయ రంగం 2.3 శాతం వృద్ధిని సాధించాయి.
మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా పథకంతో పాటు స్వతహాగా తయారీ రంగంపై దృష్టిపెట్టింది. రైతులకు మేలు చేసే చర్యలు పెద్దఎత్తున చేపట్టడం వల్లే వ్యవసాయ రంగం బాగుందని బీజేపీ నాయకులు ఇప్పటికే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ గణాంకాలతో ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.