ఎన్టీఆర్‌తో బాబి సినిమా అనగానే స్వయాన ఎన్టీఆర్ అభిమానులు కూడా నమ్మలేదు. ఎందుకంటే సర్దార్ ‘గబ్బర్ సింగ్’తో బాబి.. ఇమేజ్‌కి బాగా డామేజ్ జరిగిపోయింది. పవన్ లాంటి హీరో అవకాశం ఇచ్చినా, వినియోగించుకోలేకపోయాడన్న కామెంట్లు వినిపించాయి. ‘బాబిని పక్కన పెట్టి, పవనే ఈ సినిమాని డైరెక్ట్ చేసుకొన్నాడు’ అని చెప్పుకొన్నా ఆ ఫ్లాప్‌లో బాబి వాటా అందుకోక తప్పలేదు. అలాంటి బాబికి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ ఆఫర్ ఎలా ఇచ్చాడబ్బా?? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ.. లవకుశ మొదలవ్వడం, పూర్తయిపోవడం, ఇప్పుడు విడుదలకు రెడీ అయిపోవడం కూడా జరిగిపోయాయి.
‘జై లవకుశ’ తరవాత బాబి పరిస్థితేంటన్నది ఇప్పుడు మరో ప్రశ్న. ఈ సినిమా సెట్లో ఉన్నంత సేపూ… బాబిపై రకరకాల రూమర్లు వ్యాపించాయి. ‘బాబి డెరెక్షనేం చేయడం లేదట. అంతా ఎన్టీఆర్, చోటా కె.నాయుడు చూసుకొంటున్నార్ట’ అంటూ గుసగుసలు వ్యాపించాయి. ఆడియో ఫంక్షన్, ట్రైలర్ ఫంక్షన్ ఏం చూసినా, బాబి గురించి మాట్లాడేవారి కంటే ‘చోటా ఇరగ్గొట్టాడు.. అరగ్గొట్టాడు’ అని చెప్పిన వాళ్లే ఎక్కువ కనిపించారు. బాబి భయం కూడా అదే. ఈ సినిమా హిట్టయితే క్రెడిట్ అంతా కెమెరామెన్‌కీ, ఎన్టీఆర్‌కీ వెళ్లిపోతుందేమో అని కంగారు పడుతున్నాడట. ఒకవేళ అటూ ఇటూ అయి.. సినిమా ఫలితం తేడా వస్తే.. మళ్లీ బాబిని అనడానికి నోళ్లు లేస్తాయి. అంటే… హిట్టొస్తే – బాబికి క్రెడిట్ అంతగా రాదు.. ఫ్లాపయితే మాత్రం బాబిపై నిందలేస్తారు. బాబీ బాధ కూడా ఇదే. వర్థమాన దర్శకుల ఇబ్బందులు ఇలానే ఉంటాయి. వాళ్ల ప్రతిభ స్టార్ హీరోలు, చేతుల్లో నలిగిపోతూనే ఉంటుంది. వాళ్ల చేతుల్లోంచి బాబి తన క్రెడిట్స్‌ని ఏమాత్రం లాక్కుంటాడో చూడాలి.