ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఈ కథ అద్భుతమని, బాబికి గొప్ప ఆలోచన వచ్చిందని, మూడు పాత్రల్ని, వాటి మద్య సంఘర్షణనీ, అందులోనే జై లాంటి రావణుడ్ని సృష్టించడం మామూలు విషయం కాదని, ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచీ పుంకానుపుంకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే… బాబి ఈ లైన్‌ని ఓ తమిళ సినిమా నుంచి పట్టేశాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వరాలరు’ (2006) కథకీ, జై లవకుశ లైన్‌కీ చాలా దగ్గర పోలికలున్నాయన్నది టాక్. ‘జై లవకుశ’ కథేంటన్నది చాలా రోజుల నుంచీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అది నిజమే అని ట్రైలర్లు చూస్తే అర్థమైపోతోంది. సరిగ్గా ఇలాంటి కథే… ‘వరాలరు’లో ఉంది. అక్కడా అజిత్‌లు ముగ్గురే. కాకపోతే కవల సోదరులు కారు. ఓ తండ్రికి.. అదే పోలికలున్న ఇద్దరు పుడతారు. కానీ… ‘జై లవకుశ’లోలానే చిన్నప్పుడే కవలలిద్దరూ విడిపోతారు. పెద్దయ్యాక ఒకరి ఉనికిని మరొకరు తెలుసుకొని, ఒకరి స్థానంలో మరొకరు వెళ్లి కన్ఫ్యూజ్ చేయడం అనే పాయింట్ అక్షరాలా.. ‘వరాలరు’ సినిమాలోనిదే అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అందులో తండ్రి ఓ నాట్యాచారుడు. జై లవకుశలోనూ నాటకాల నేపథ్యం ఉంది. నాటకాల అజిత్‌కి కాస్త అంగ వైకల్యం కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ నత్తి నత్తిగా మాట్లాడతాడు. ఆ నాట్యాచారుడు క్రమంగా… డాన్‌గా మారతాడు. జై లవకుశలో జై.. పొలిటీషియన్‌గా ఎదుగుతాడు. అంతే తేడా. కథ ప్రకారం లవకుశ, అజిత్ సినిమా సేమ్ టూ సేమ్‌గా అనిపిస్తున్నాయి. మరి తీత ఎలా ఉంటుందో చూడాలి.