‘జై లవకుశ’లోని మూడు పాత్రల్లోని జై నెగిటీవ్ రోల్ అని తేలిపోయేసరికి రకరకాల కథలు, కథనాలు బయటకు వచ్చేశాయి. ఈ ముగ్గురూ అన్నదమ్ములనీ, చిన్నప్పుడే విడిపోతారని, ఎక్కడెక్కడో పెరిగి పెద్దవాళ్లవుతారని, జై… తన ఎదుగుదల కోసం మిగిలిన ఇద్దర్నీ వాడేసుకొంటాడని, చివర్లో చనిపోతాడని.. ఇలా ‘జై లవకుశ’ కథ గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు. అయితే.. `జైలవకుశ` ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాటలు చూస్తుంటే.. ఈ సినిమా మరో కలర్లో సాగే అవకాశాలున్నట్టు అర్థం అవుతోంది. ‘లవకుశ’లా ‘జై లవకుశ’ కూడా అన్నదమ్ముల అనుబంధాన్ని చాటి చెప్పే సినిమా అట!
ఇక్కడ ‘అనుబంధం’ అనే మాట ఏ అర్థంలో వాడాడో తెలీదు గానీ – ఇప్పటి వరకూ సర్కిల్ అవుతున్న కథ కీ, అసలు కథకీ సంబంధం లేదేమో అనిపించేలా ఉన్నాయి ఎన్టీఆర్ మాటలు. ఒకొక్క పాత్రలోనూ రెండు మూడు షేడ్స్ ఉండబోతున్నాయేమో..? ఎవరు విలనో, ఎవరు హీరోనో చివరి వరకూ చెప్పలేమేమో అనిపిస్తోంది. ‘జై’ని విలన్ అనుకొని థియేటర్లోకి అడుగుపెట్టేవాళ్లకు.. షాకిచ్చే విషయం ఏదో సినిమాలో ఉండే ఉంటుంది. అదే నిజమైతే… ‘జై లవకుశ’ వెండి తెరపై మరింత థ్రిల్ చేయడం ఖాయం.