ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి కాస్త కార్యక్రమాలు పెంచిన ప్రతిసారీ లేదా విమర్శలు తీవ్రమైన ప్రతి సందర్భంలో పాలకపక్షం అంబులపొదిలోంచి జగన్ కేసులు బయిటకు తీస్తుంటుంది. ఆయన పాదయాత్ర నిర్ణయం నేపథ్యంలోనూ అదే జరుగుతున్నది. ఎంతోసీనియర్ అయిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు , హౌం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏ కేసులో ఏమి తీర్పునిస్తారు, ఎప్పుడు ఇస్తారు అన్నది ఒక సస్పెన్స్. కాని మంత్రులు మాత్రం మాటిమాటికి జైలు పాట పాడటానికి ఆధారం ఏమిటి? అసలు జగన్ ప్రతిపక్ష నేత కావడమే జైలుకు వెళ్లివచ్చిన తర్వాత కదా 16 మాసాలు జైలులో వుండి విచారణ నెదుర్కొని ఆయన బయిటకు వచ్చి 67 స్థానాలు గెలవడం రాజకీయంగా చెప్పుకోదగిన విజయం. అందులో మూడో వంతు టిడిపిలో చేరినా ఇంకా రెండు వంతులు వున్నారు. తమిళనాడులో జయలలిత లేదా బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసులు జైళ్లు ఎదుర్కొంటున్నా జనం గెలిపించారు. ఈ మూడేళ్లలోనూ టిడిపి ప్రభుత్వం జగన్పై కేసులకు సంబంధించి కొత్తగా బయిటకు తీసిన ఇరకాటంలో పెట్టిన అంశం ఒక్కటంటే ఒక్కటి లేదు.జగన్పై ఆరోపణలు ప్రధానంగా ఆర్థిక సంబంధమైనవి గనక యనమల వంటివారు అక్కడ ఏదైనా చేసి చెబితే బావుంటుంది.అంతేగాని జైలుపాటనే వినిపిస్తే విసుగొచ్చేయదూ? విలువ కూడా పోతుంది. తామే ప్రజలను అలవాటు చేసినట్టవుతుంది కూడా. కాకుంటే తమ వెనక వున్నవారిని నిలబెట్టుకోవడానికి కొంత ఉపయోగం కావచ్చు గాని అభిమానించేవారిలో మద్దతు ఇంకా పెరిగే అవకాశం కూడా వుండొచ్చు