అర్థరాత్రి బెడ్ రూం తలుపులు బద్దలు కొట్టి మరీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది. ప్రచారం ముగియడానికి ఒక్క రోజు ముందు.. రాజకీయంగా అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో పోలీసులు రేవంత్ పైన, రేవంత్ కుటుంబ సభ్యులపైనా దూకుడుగా వ్యవహరించారు. రేవంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పోలీసులు వ్యవహరించిన విధానం వైరల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిలు ఖండించారు. రేవంత్ ను అరెస్ట్ చేసి.. అసలు ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా.. కుటుబసభ్యులకు చెప్పలేదు. చివరికి జడ్చర్లకు తరలించినట్లు పోలీసులకు మీడియాకు సమాచారం ఇచ్చారు.
రేవంత్ ను అరెస్ట్ చేసిన తీరుపై.. ఆయన భార్య గీత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ కూడా పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమయింది. హైదరాబాద్, ఢిల్లీల్లో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్, కపిల్ సిబల్ ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి రాజకీయంగా టీఆర్ఎస్ కు … ఇబ్బందికరంగా మారింది. ఈ అరెస్ట్ టీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేకపోయారు. బెడ్ రూం తలుపులు బద్దలు కొట్టి మరీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు..
పోలీసుల అత్యుత్సాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియడం లేదు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కేసీఆర్ తీరును.. ఎమర్జెన్సీతో పోల్చారు. హౌస్ అరెస్ట్ చేసుకునే అవకాశం ఉన్నా… కావాలనే కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేశారని మండిపడ్డారు. ” రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీ కూతురిని అలానే డోర్ పగలగొట్టి అరెస్ట్ చేస్తే ఊరుకుంటావా..” అని కేసీఆర్ పై జైపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓటమి భయం పట్టుకునే సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అందుకే సంగారెడ్డిలో జగ్గారెడ్డి, గజ్వేల్‌లో ప్రతాప్ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పట్ల దుర్మార్గం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.