హైదరాబాద్: సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని గెలిచారేగానీ, కేసీఆర్కు పాలనా సమర్థత లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్వి కేసినో రాజకీయాలని, ఇంతవరకు ఎన్నికల్లో ఎవరూ చేయనన్ని వాగ్దానాలు చేశారని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో ఇన్ని హామీలు ఇచ్చినవారిని తాను చూడలేదని చెప్పారు. రాజకీయాలను జూదంగా మార్చారని, ఇద్దరు డిప్యూటీ సీఎమ్లను బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ పాలనలో ఎవరి సమస్యలూ తీరలేదని అన్నారు. టీఆర్ఎస్ అహంకారానికి వరంగల్ లోక్సభ ఉపఎన్నిక నిదర్శనమని చెప్పారు. ఉపఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తారని అన్నారు. బాధ్యత లేకుండా హామీలిచ్చిన కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధికి వరంగల్ గెలుపును కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు.