మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో తెరాస నేతలతో కలిసి తెర వెనుక చాలా కధ నడిపించి తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆయనతో సహా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ని తమ పెరట్లో తిరిగే కోడి అన్నట్లుగా చాలా తక్కువ అంచనా వేశారు. తెలంగాణా కావాలంటే తెరాసని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కెసిఆర్ కూడా వారి భ్రమలు వమ్ము చేయకుండా వాళ్ళు చెప్పిన ప్రతీ మాటకి తలూపారు. ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. కెసిఆర్ ఇప్పుడు రాష్ట్రంలో హస్తం గుర్తులు లేకుండా చేరిపేస్తుంటే జైపాల్ రెడ్డి వంటి కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు కూడా ఏమీ చేయలో పాలుపోక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే తప్పకుండా అధికారంలోకి వస్తుందని సర్ది చెప్పుకొంటూ తెరాసలోకి వెళ్ళిపోతున్న కాంగ్రెస్ నేతలని లెక్క పెట్టుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు.
జైపాల్ రెడ్డి కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెరాసని ఓడించి మళ్ళీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధిస్తామని చెప్పారు. కెసిఆర్ ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు పదవులు, అధికారం అనుభవించిన నేతలు పార్టీ ఓడిపోగానే తెరాసలో చేరిపోతున్నారని, అటువంటి అవకాశవాదులు వెళ్ళిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడని చాలా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయని, తెరాసకి అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
ఫిరాయింపులకి రాజకీయ శక్తుల పునరేకీకరణ అని కెసిఆర్ చాలా గంభీరమైన పేరు పెట్టిన్నప్పటికీ, ఆయన చేస్తున్న పని అప్రజాస్వామికమని అందరికీ తెలుసు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కెసిఆర్ తన పద్ధతి మార్చుకోకుండా ఫిరాయింపులని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా ఖాళీ అయిపోతోంది. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండాపోవచ్చునని జైపాల్ రెడ్డి కూడా తెలుసు. కనుక తెరాసపై హూంకరించడం వలన ఏమీ ప్రయోజనం లేదని గ్రహించినప్పుడు కెసిఆర్ బారి నుంచి తన పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలి? మళ్ళీ ఏవిధంగా బలం చేకూర్చుకోవాలి? కెసిఆర్ ని ఏవిధంగా నిలువరించాలి? అని ఆలోచించి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తాము.. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధిస్తాము..పాట పాడుకొంటూ కాలక్షేపం చేస్తే కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు అందరూ వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోక తప్పదు.