తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఒక పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళిక రచిస్తోందని సమాచారం! తెర వెనక చర్చోపచర్చలు, సమాలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయమంతా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది కదా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉత్తమ్ ను ప్రకటించాలంటూ ఈ మధ్య కొంతమంది నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే, తెర వెనక సాగుతున్న అసలు కథ ఇంకోలా ఉందట!
టి. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడైన జైపాల్ రెడ్డికి ప్రాధాన్యత పెంచబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరమనుకుంటే ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఛాన్సులు ఉన్నాయని ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆఫ్ ద రికార్డ్ అన్నారు! ఆయనే ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా కాంగ్రెస్ పోటీకి వెళ్లడం శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంతో అధిష్టానం ఉంది. ఇతర రాజకీయ పార్టీతోపాటు ప్రజాసంఘాలను కూడా కలుపుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉత్తమ్ వల్ల సాధ్యమా అనే అనుమానం హైకమాండ్ కి ఉందని సమాచారం. ఒకవేళ సాధ్యమైనా ఉత్తమ్ అంటే గిట్టని నాయకులు కాంగ్రెస్ లోనే కొంతమంది ఉన్నారు కదా! సో… సీనియర్ నాయకుడైన జైపాల్ రెడ్డిని తెరమీదికి తీసుకొస్తే… వీటన్నింటినీ పక్కాగా డీల్ చేయగలరేమో అనే ప్రతిపాదన ఢిల్లీ పెద్దల్లో ఉందని అంటున్నారు. నిజానికి, సీఎం కేసీఆర్ కి ధీటుగా మాట్లాడాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నది జైపాల్ రెడ్డి మాత్రమే అనడంలో సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆంధ్రా పొలిటికల్ లాబీ బలంగా ఉన్నా… జైపాల్ వ్యూహాలు ఢిల్లీ స్థాయిలో వర్కౌట్ అయ్యాయనీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చితీరాలంటూ నాడు సోనియాపై ఒత్తిడి పెంచారనీ అంటారు. నిజానికి, తెలంగాణ ఏర్పడింది కాంగ్రెస్ హయాంలోనే అయినా, ఆ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా మార్చితే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ ను కంటెంట్ తో ఎదుర్కోవాలన్నా, ప్రస్తుతం తెలంగాణలో కాస్త యాక్టివ్ అవుతున్న తెరాస వ్యతిరేక ప్రజాసంఘాలు, కాంగ్రెస్ లో కాస్త అసంతృప్తిగా ఉన్న కొంతమంది నాయకుల్ని కలుపుకుని ముందుకు సాగాలన్నా జైపాల్ అనుభవమే పార్టీకి అవసరం అనేది ఢిల్లీ పెద్దల ఆలోచనగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా, వచ్చే ఎన్నికలకు ఇప్పట్నుంచే పకడ్బందీ ప్రణాళికలు వేసే పనిలో టి. కాంగ్రెస్ మునిగితేలుతోందన్నది వాస్తవం.