ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్, దానికి దారి తీసిన రాజకీయ పరిణామాలు, విభజన ప్రక్రియ మొదలైన వివరాలతో “ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన,” అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఉభయ రాష్ట్రాల ప్రజలలో, రాజకీయ నేతలలో విభజనపై నెలకొన్న అనేక అనుమానాలు, అపోహలు దూరం చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పుస్తకాన్ని వ్రాసినట్లు తెలిపారు.
ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన తెలుగు 360కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు:
ప్రశ్న: రాష్ట్ర విభజనపై మీకే పూర్తి నిర్ణయాధికారం ఉన్నట్లయితే మీరు రాష్ట్ర విభజన చేసేందుకు అంగీకరించేవారా?
జైరాం రమేష్: కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చూసినట్లయితే ఇది సరైన నిర్ణయం కాదని చెప్పవలసి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే అది చాలా ఘోరమైన తప్పిదమేనని చెప్పక తప్పదు. కానీ ఈ నిర్ణయాన్ని ఆవిధంగా చూడటం తప్పు అని నా పుస్తకంలో వ్రాశాను. ఎందుకంటే, రాష్ట్ర విభజన వలన రెండు రాష్ట్రాల ప్రజలకి మేలు కలుగుతుందా..లేదా? అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరుగుతుందా..లేదా? అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందుతాయా..లేదా? రెండు రాష్ట్రాలలో సమానంగా అభివృద్ధి జరుగుతుందా..లేదా? అనే కోణంలో నుంచి మాత్రమే ఈ నిర్ణయాన్ని బేరీజువేసి చూడవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడే సమాధానాలు కోరుకోవడం తొందరపాటే అవుతుంది. ఒకటి మాత్రం చెప్పగలను.. అనివార్యమైన పరిస్థితులు ఏర్పడినందునే రాష్ట్ర విభజన చేయవలసి వచ్చింది.
ప్రశ్న: రాష్ట్ర విభజన కారణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక రాష్ట్రంలో మళ్ళీ పార్టీ నిలద్రొక్కుకొనేందుకు మీ పార్టీ రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడుతుందా?
జైరాం రమేష్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనని, ఆగ్రహాన్ని, వారి మనోభావాలని నేను అర్ధం చేసుకోగలను. అయితే రాష్ట్ర విభజన జరిగినందుకు ఏపిలో ఎంత మంది బాధపడుతున్నారో, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ఆ రాష్ట్రంలో అంతమంది చాలా సంతోషపడుతున్నారు. రాష్ట్ర విభజన వద్దనడానికి ఎన్ని బలమైన కారణాలున్నాయో, చేయడానికి అన్నే బలమైన కారణాలున్నాయి. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది కానీ అనివార్యం కావడంతో విభజన చేయవలసి వచ్చింది. ఆ నిర్ణయం కొందరికి సంతోషం, కొందరికి బాధని మిగిల్చిందన్న మాట వాస్తవం. ఇది నా స్వంతః నిర్ణయమో లేదా ఎవరి వ్యక్తిగత అభిప్రాయం, కోరిక మేరకు తీసుకొన్న నిర్ణయం కాదని మాత్రం చెప్పగలను.
ప్రశ్న: కెసిఆర్ తన తెరాస పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెపితే సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా నమ్మేసింది? అదే కెసిఆర్ ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నారు కదా?
జైరాం రమేష్: అవును. కెసిఆర్ మాటలని నమ్మడం చాలా పొరపాటే! ఆయన ఒక అవకాశవాది. పరిస్థితులని బట్టి వ్యవహరించడంలో ఆయనకి ఆయనే సాటి. ఆయన మాపార్టీని కూడా తన మాటలతో భ్రమింపజేయగలిగారు. 2000 సం.లో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కెసిఆర్ కి తన మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి ఇచ్చి ఉన్నా, 2009 సం.లో మాజీ ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మరణించకపోయినా నేడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరొకలాగ ఉండేది. నిజానికి చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు వారే కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నారు. 2014 ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి 26% ఓట్లు లభించడం గమనిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలద్రొక్కుకోవడం ఖాయమని నమ్ముతున్నాను.
ప్రశ్న: మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మీరు విభజన ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏపికి చెందిన కొందరు ఎంపిలతో కలిసి ఆమె మిమ్మల్ని ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చమని అడిగితే, అది సాధ్యం కాదని మీరు చెప్పారుట! నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే మున్ముందు మీ పార్టీ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆనాడు దానిని విభజన చట్టంలో చేర్చలేదా? అప్పుడు సాధ్యం కాదని చెపితే దాని కోసం ఇప్పుడు మీ పార్టీ ఎందుకు ఉద్యమిస్తున్నట్లు? మీ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేవారా లేదా? రాష్ట్రంలో మీ పార్టీ నేతలు ప్రత్యేక హోదా గట్టిగా మాట్లాడుతున్నారు. అది నిజంగా ప్రత్యేక హోదా కోసమేనా లేపోతే ఆ సాకుతో మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలని ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా మాట్లాడుతున్నారా?
జైరాం రమేష్: పురందేశ్వరి, ఏపి ఎంపిలు మాతో హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం గురించి మాత్రమే మాట్లాడారు. దాని సాధ్యాసాధ్యాల గురించి చర్చించిన మాట వాస్తవం. కానీ ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చమని వారు కోరలేదు. 2002లో వాజ్ పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం ఏవిధానం, పద్దతులు అవలంభించారో దానినే మేము ప్రామాణికంగా తీసుకొని, దానినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానిని వర్తింపజేశాము తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. వాజ్ పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్ కి ప్రత్యేక హోదా అంశాన్ని యూపి విభజన చట్టం-2000లో చేర్చలేదు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లో దానిని చేర్చలేదు. ప్రత్యేక హోదా అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే జాతీయ అభివృద్ధి కౌన్సిల్ దానిని కేవలం గుర్తించవలసి ఉంటుందే తప్ప దాని ఆమోదం అవసరం ఉండదు. అందుకే అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు వెంకయ్య నాయుడు ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు కావాలని పట్టుబట్టారు. ఇప్పుడు వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కానీ అసలు ప్రత్యేక హోదా ఇవ్వడమే సాధ్యం కాదని చెపుతోంది. దానికి కూడా తిరిగి మమ్మల్నే నిందిస్తున్నారు.
ప్రశ్న: మీ పార్టీకి నిజంగానే ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే, పార్టీ తరపునే పార్లమెంటులో దాని కోసం నోటీస్ ఇవ్వవచ్చు కదా? అలా చేయకుండా కెవిపి రామచంద్ర రావు చేత ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టించారు? అది రాజకీయ ఎత్తుగడ కాదా?
జైరాం రమేష్: ఈ వాదన చాలా అర్ధరహితంగా ఉంది. పార్లమెంటు విధివిధానాల తెలియనివాళ్ళే ఈవిధంగా వాదిస్తారు. ప్రైవేట్ బిల్లు అంటే పార్లమెంటు సభ్యులు వ్యక్తిగత హోదాలో ప్రవేశపెట్టే బిల్లులు అని అర్ధం. వాటికి పార్టీ అనుమతి అవసరం అక్కరలేదు. వాటిని మనం ప్రైవేట్ మెంబెర్స్ బిల్స్ అని అంటున్నాము కానీ వాటిని మెంబర్స్ ప్రైవేట్ బిల్స్ అని చెప్పుకోవలసి ఉంటుంది. ఆవిధంగా సవరణ చేయాలని నేను చాలా కాలంగా కోరుతున్నాను.
ప్రశ్న: రాష్ట్ర విభజన వలన కాంగ్రెస్ పార్టీకి, రెండు రాష్ట్రాలకి కూడా చాలా నష్టం, కష్టాలు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదేపదే మీ పార్టీని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం చాలా పొరపాటని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని వస్తే ఆహ్వానిస్తారా?
జైరాం రమేష్: ఆయన విషయంలో మా పార్టీ చాలా పెద్ద పొరపాటు చేసిందని నేను భావిస్తున్నాను. పార్టీని, దాని నిర్ణయాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయనని అసలు అంతకాలం ఆ పదవిలో కొనసాగనివ్వడమే చాలా పొరపాటు. ఆయనే పార్టీలో ఉంటూ దానినని లోపల నుండి దెబ్బ తీశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి పోరాడి ఉంటే హుందాగా ఉండేది. కానీ ఎప్పుడూ మంత్రిగా కూడా పనిచేయని ఆయనకీ పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తే చివరికి ఆయన పార్టీనే దెబ్బతీశారు. ఆయన పార్టీలో ఉన్నప్పుడు నేను కూడా ఆయనతో చాలా సన్నిహితంగా కలిసి పనిచేశాను. ఆయన మా పార్టీతో ఏవిధంగా వ్యవహరించినప్పటికీ ఆయనకి అంతా మంచే జరగాలని నేను కోరుకొంటున్నాను.
ప్రశ్న: చంద్రబాబు పనితీరు ఎలాగుంది? రాష్ట్ర విభజన కారణంగా ఆర్ధిక సమస్యలు, కేంద్రం సహకారం అందక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన మళ్ళీ గాడిన పెట్టగలరని మీరు భావిస్తున్నారా?
జైరాం రమేష్: తెదేపా, భాజపాలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కూడా ఉన్నాయి. పైగా అయనకి చాలా సన్నిహితుడైన వెంకయ్య నాయుడు మోడీకి కూడా అత్యంత సన్నిహితుడు. అయినా చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి అవసరమైన సహాయం పొందలేకపోతున్నారు. ఇది నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. బహుశః ప్రధాని నరేంద్ర మోడీ-చంద్రబాబు నాయుడు మద్య అంత సత్సంధాలు లేవనిపిస్తోంది.
ప్రశ్న: ఏపిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడి అధికారంలోకి రాగలదని మీరు భావిస్తున్నారా? అందుకోసం అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలని మీ పార్టీ భావిస్తోందా?
జైరాం రమేష్: నిజమే! రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో మా పార్టీ 2శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. మళ్ళీ పుంజుకోవాలంటే చాలా సమయమే పట్టవచ్చు. అయితే విభజన కారణంగానే రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాలు చాలా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్ర ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం నాకుంది, అని జైరాం రమేష్ ఇంటర్వ్యూ ముగించారు.