ఏపీని విభజించాలని నిర్ణయం తీసుకున్న మేధావుల్లో ఒకరు… విభజన చట్టం రచయిత అయిన జైరాం రమేష్ .. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఏపీకి వచ్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై అత్యంత చులకన భావం ఉన్న నేత జైరాం రమేష్. అమరావతిని వైసీపీ నేతలు చెప్పినట్లుగా కమ్మరావతి అని సంబోధిస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించానని కొలికపూడి శ్రీనివాసరావు ఓ పుస్తకావిష్కరణ సభలో చెప్పారు. అలాంటి జైరాం రమేష్‌ను మళ్లీ ఏపీకి పంపింది కాంగ్రెస్ హైకమాండ్.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ఆ రాష్ట్రం నుంచి ఏపీలోకి ఎంటరవనుంది. నాలుగు రోజుల పాటు ఏపీలో పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కర్నూలు జిల్లాలో జైరాం రమేష్ పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రూపకల్పనలో జైరాం రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఐదేళ్లపాటు ఏపీకి ప్రత్యేకహోదాను రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అయితే బిల్లులో ఆ మేరకు పెట్టి చట్టసవరణ చేయకుండా ప్రధాని ప్రకటనతోనే బిల్లు పాస్ చేసేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని ప్రకటించింది. బిల్లులో లేకపోవడంతో ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కాలేదు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఒకే మాట మీద ఉంది. గత ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామనే చెప్పింది. కానీ అప్పటికే ఏపీలో ఆ పార్టీ పూర్తిగా నిర్వర్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుస్తుందో.. ఎప్పుడు ప్రత్యేకహోదా ఇస్తుందో కానీ.. ఆ పార్టీకి ఏపీలో ఈ హామీ ఎలాంటి రాజకీయ ప్రయోజనం కల్పించే అవకాశం లేదు. జైరాం రమేష్ లాంటి నేతలు పర్యటిస్తే అసలుకే చాన్స్ రాదు.