రెండు తెలుగు రాష్ట్రాలలో 2026 వరకు అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన డిల్లీలో సాక్షి మీడియాతో మాట్లాడుతూ దానికి కొన్ని కారణాలు చెప్పారు. 1. రాజ్యాంగంలో అంతవరకు సీలింగ్ ఉంది. 2. చాలా రాష్ట్రాలు సీట్ల పెంపు కోసం డిమాండ్ చేస్తున్నాయి కనుక చాలా పార్టీలు చట్ట సవరణకు అంగీకరించకపోవచ్చు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సీట్ల పెంపు సాధ్యం కాదు.
ఆయన చెపుతున్న ఈ కారణాలు చాలా సహేతుకంగానే ఉన్నాయి. కానీ ఆయన ఆవిధంగా చెప్పడానికి కూడా రెండు కారణాలు కనబడుతున్నాయి.
- ఆవిధంగా చెప్పడం ద్వారా రెండు రాష్ట్రాలలో పార్టీ మారాలనుకొంటున్న వారిని నిరుత్సాహపరచడం. 2. సీట్లు పెంపు సమస్యని హైలైట్ చేసి రెండు రాష్ట్రాలలో తెదేపా, తెరాసలో అంతర్గతంగా ఒత్తిడి సృష్టించడం. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేలా చేసి ఇరుకున పెట్టడం.
పార్టీ ఫిరాయింపులతో తీవ్రంగా నష్టపోతున్నవి కాంగ్రెస్, వైకాపాలే కనుక అవే ఈ వార్తని ఎక్కువ హైలట్ అయ్యేలా ప్రచారం చేస్తున్నాయని చెప్పవచ్చు. బహుశః మున్ముందు ఈ ప్రచారం ఇంకా ఉదృతం చేసినా ఆశ్చర్యం లేదు. తద్వారా తెదేపా, తెరాసలలో చేరిన, చేరుతున్న తమ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలలో భయాందోళనలు రేకెత్తించగలిగితే, ఆ రెండు పార్టీలలో కూడా కలకలం మొదలవుతుంది. చివరికి అదే ఆ రెండు పార్టీలను దారుణంగా దెబ్బతీస్తుంది.
అయితే జైరాం రమేష్ చెప్పిన విషయంలో పూర్తిగా రాజకీయ కోణం నుంచే కాకుండా అందులో సాధ్యాసాధ్యాలను కూడా లెక్కలోకి తీసుకొని చూసినట్లయితే, ఆయన చెప్పినది సహేతుకమేనని అర్ధమవుతుంది. సీట్లు పెరుగబోతున్నాయని చెప్పుకొంటూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి జబ్బలు చరుచుకొంటున్న ఆ రెండు పార్టీలకు, ఒకవేళ జైరాం రమేష్ చెప్తునట్లుగా అసెంబ్లీ సీట్లు నిజంగానే పెరగకపోయినట్లయితే అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికలలోగా రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెరుగకపోతే, ఆ రెండు పార్టీలలో చేరినవారికి, పార్టీలో చిరకాలంగా ఉన్నవారికి మధ్య సీట్ల కోసం కొట్లాటలు తప్పకపోవచ్చు. ఇప్పుడు ఆ రెండు పార్టీలలో వచ్చి చేరుతున్న వారందరూ ఇదే వేగంతో గోడకి కొట్టిన బంతిలా మళ్ళీ అందరూ తమ తమ పార్టీలలోకి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దాని వలన ఆ రెండు పార్టీలే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని వేరే చెప్పక్కరలేదు.