మాజీ ప్రధాని ఇందిరా గాంధీని జర్మనీ నియంత హిట్లర్ తో పోల్చారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. దేశంలో ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు అయిన సందర్భంగా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని బేఖాతరు చేశారనీ, ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పాలన తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశప్రజలందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికారనీ, రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయని జైట్లీ చెప్పారు. ఆ సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకున్నారనీ, సత్యాగ్రహాలు చేస్తూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లారని గొప్పగా ఒక ట్వీట్ లో రాశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.
ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేసుకోవడం, అలాంటి పరిస్థితులు ఇంకెప్పుడూ రాకూడదని చర్చించుకోవడం వరకూ ఓకే. కానీ, పనిగట్టుకుని ఇందిరా గాంధీని హిట్లర్ తో పోల్చాల్సిన సందర్భమా ఇది అనేదే ప్రశ్న..? ఎందుకంటే, దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీ.. తరువాత ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తీవ్ర ప్రజాగ్రహానికి గురై ఓటమి పాలయ్యారు. హిట్లర్ మాదిరిగా పూర్తి నియంతృత్వ ధోరణిలో ఆమె వ్యవహరించి ఉంటే.. ఎమర్జెన్సీ తరువాత ఎన్నికలు ఎందుకు నిర్వహించారు..? అంటే, ప్రజాభిప్రాయానికి భయపడో, ప్రజాస్వామ్యానికి విలువనిచ్చో మళ్లీ వెనక్కి తగ్గారు కదా. హిట్లర్ ది కేవలం ఆధిపత్య కాంక్ష మాత్రమే. ఇందిరా గాంధీ ఇగోలకు పోయి ఒక దశలో తీవ్రంగా వ్యవహరించారు.
ఇక్కడ అరుణ్ జైట్లీ ఆశిస్తున్న రాజకీయ లబ్ధి కోణం కూడా ఉంది! ఇందిరా కుటుంబాన్ని, వారసుల్ని నియంతలు అంటూ మాట్లాడటం ద్వారా వారి వారసులపై ప్రజల్లో ఒకరకమైన వ్యతిరేక భావన పెంచాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఎమర్జెన్సీ రోజుల్ని అరుణ్ జైట్లీ గుర్తు చేసుకుంటూ హిట్లర్ పోలిక తేవడంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టూ అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. సమకాలీన నాయకుల్లో హిట్లర్ స్థాయి నియంతృత్వ పోకడలు పోయే అవకాశం ఉన్న నాయకుడు ఎవరున్నారంటే.. నరేంద్ర మోడీ అనేవారూ లేకపోలేదు! ఎందుకంటే, ఆయన పాలనలో నియంతృత్వ పోకడల్ని ప్రజలు చూస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ధరల పెరుగుదల, రాష్ట్రాలపై నిర్లక్ష్య వైఖరి, అధికారమంతా కేంద్రం గుప్పిట్లో ఉండాలనే ధోరణి, తిమ్మిని బమ్మి చేసైనా సరే రాష్ట్రాల్లో భాజపాని అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించే తీరూ.. వీటన్నింటినీ నియంతృత్వ పోకడలు అనే కదా అంటారు. ఇలాంటి పాలన వారే చేస్తూ.. హిట్లర్ ను అరుణ్ జైట్లీ గుర్తు చేస్తే ఎలా..?