సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభలో అడుగుపెట్టినప్పటి నుంచి నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకొని చాలా తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వలన దేశ ఆర్ధిక వ్యవస్థకి చాలా నష్టం జరుగుతోందని, కనుక ఆయనని తక్షణమే పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాళ్ళ కూడా స్వామి గవర్నర్ ఫై మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయనను తక్షణమే పదవిలో నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ వ్రాశారు.
ఆయన ఆరోపణలు ఏమిటంటే, దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించేందుకు గవర్నర్ వడ్డీ రేట్లను తరచూ సవరిస్తున్నారు. సమావేశాలలో మోడీ ప్రభుత్వం పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా గ్రీన్ కార్డ్ కలిగి ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకి సంబంధించిన అతి రహస్యమైన విషయాలను ప్రపంచంలో వివిధ దేశాల సంస్థలకు పంపిస్తున్నారు. ఆయన అమెరికాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కనుక తక్షణమే ఆయనని ఆ పదవి నుంచి తొలగించాలని స్వామి డిమాండ్ చేస్తున్నారు.
సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఈ విమర్శలు, ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తన పార్టీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు తన ప్రభుత్వంలో అతి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు, తక్షణమే జోక్యం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని మందలించి ఉండాలి. లేదా ఆయన చేస్తున్న ఆరోపణలతో ప్రధాని కూడా ఏకీభవిస్తున్నట్లయితే, రఘురామ రాజన్ ని పిలిచి ఆయన వివరణ తీసుకొని దానిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏమీ చేయకుండా మౌనం వహించడం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలకు ఆయన ఆమోదం ఉందని సూచిస్తున్నట్లుంది.
ప్రధాని మౌనం వహించిన సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ వ్యాఖ్యలపై చాలా సున్నితంగా స్పందించడం విశేషం. “నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలను సమర్ధించను. అది ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ అయినా ఎవరైనా సరే! ఆర్.బి.ఐ. ఒక ప్రత్యేక వ్యవస్థ. దాని నిర్ణయాలు కొందరికి నచ్చవచ్చు, మరి కొందరికి నచ్చకపోవచ్చు. కానీ అంత మాత్రాన్న ఒకరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు,” అని అన్నారు.
ఆర్.బి.ఐ.గవర్నర్ పై సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణలని వింటూ కూడా ప్రధాని మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంటే, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇంత మృదువుగా చెప్పడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది సుబ్రహ్మణ్య స్వామికీ రఘురామ రాజన్ మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధమా… లేక ప్రధాని మోడీకి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి మద్య జరుగుతున్న పరోక్ష యుద్ధామా…అనే అనుమానం కలుగుతోంది. ఏమైనప్పటికీ దేశ ఆర్ధిక వ్యవస్థలో అంత కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తిని క్రిమినల్ అన్నట్లుగా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడటం చాలా తప్పు. ఆయనని నిందిస్తుంటే ప్రధాని మౌనం వహించడం ఇంకా తప్పు.