పీస్ టీవి ఛానల్ ద్వారా ఇస్లాం మత భోదనలు చేసే జకీర్ నాయక్ తన భోదనలతో ముస్లిం యువకులని ఉగ్రవాదం వైపు మళ్లే విధంగా ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలు రావడంతో, ముంబై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన దుబాయిలో ఉండగా ఈ సంగతి తెలుసుకొని, భారత్ తిరిగి రాకుండా అక్కడి నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళిపోయారు. మళ్ళీ భారత్ ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు.
తను యువతని ఎన్నడూ ఉగ్రవాదంవైపు వెళ్లేందుకు ప్రోత్సహించలేదని, తనపై భారత్ మీడియా తప్పుడు వార్తలు, కధనాలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ ప్రధాన ఎడిటర్ అర్నబ్ గోస్వామితో సహా మరో పది మీడియా సంస్థలపై తన లాయర్ ముబిన్ సోల్కర్ ద్వారా రూ.500 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. వారందరూ జకీర్ నాయక్ పై చేసిన నిరాధారమైన ఆరోపణలని ఉపసంహరించుకొని, ఆయనకి క్షమాపణలు చెప్పాలని లేకుంటే కేసుని ఎదుర్కోవాలని ముబిన్ సోల్కర్ హెచ్చరించారు.
ఇటీవల బంగ్లాదేశ్ లో కొందరు ఉగ్రవాదులు డాకాలోని ఒక రెస్టారెంట్ లో ప్రవేశించి కొంతమందిని అతికిరాతకంగా గొంతుకోసి హత్యలు చేసారు. వారిలో భారత్ కి చెందిన ఒక యువతి కూడా ఉంది. అనంతరం బంగ్లాదేశ్ పోలీసుల దర్యాప్తులో వారందరూ జకీర్ నాయక్ మత భోదనలతో ప్రభావితులై ఉగ్రవాదులుగా మారినట్లు తెలిసింది. అప్పుడే బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశంలో పీస్ టీవి ప్రసారాలని నిలిపివేసింది.
ఆ వార్తలని, జాకీర్ నాయక్ మత భోధనల విధానం గురించి టైమ్స్ నౌ తో సహా దేశంలో దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్ ప్రసారం చేశాయి. అదే సమయంలో ముంబై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జకీర్ నాయక్ నిజంగా తను ఎటువంటి తప్పు చేయలేదని భావిస్తే దుబాయ్ నుంచి భారత్ తిరిగి వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని ఉండాలి కానీ దుబాయ్ నుంచి ఇంకా ఎక్కువ సురక్షితమైన దేశంగా పేరొందిన సౌదీ అరేబియాకి పారిపోయారు. మళ్ళీ భారత్ తిరిగి వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇంతకాలం ఆయన చెప్పింది ఇతరులు వినేవారు. కానీ ఇప్పుడు ఆయన గురించి మీడియా చెపుతుంటే ఆయన వినవలసి రావడంతో జీర్ణించుకోలేక మీడియాపై పరువు నష్టం దావా వేశారు. అదే పని ఆయన భారత్ తిరిగి వచ్చి చేసినా ఆయనపై కొంత సానుభూతి కలిగేది కానీ సౌదీఅరేబియా పారిపోయి అక్కడి నుంచి లాయర్ ద్వారా భారత్ లో కేసు వేశారు. ఒకవేళ ఆ కేసులో విచారణకి హాజరుకమ్మని న్యాయస్థానం ఆదేశిస్తే అప్పుడైనా జాకీర్ నాయక్ భరత్ తిరిగి వస్తారో లేదో చూడాలి.