పోలవరం ఇంజినీర్‌పై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందరి ముందు దాడి చేయడం ఉద్యోగవర్గాల్లో కలకలం రేపుతోంది. పోలవరం కాలువ అంచనాలు పెంచి బిల్లులు తయారు చేయాలని రాజా ఆదేశిస్తే.. ఆ ఇంజినీర్ తన వల్ల కాదన్నారు. అది నచ్చని రాజా… సమావేశంలోనే ఇతర ఉన్నతాధికారులు ఉండగానే దాడి చేశారు. మూడుసార్లు చెంపలు వాయించారు. మామూలుగా అయితే ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం చిన్న విషయం కాదు . కానీ ఇక్కడ మాత్రం ఆ దాడికి గురయిన ఇంజినీర్‌కు ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా లేదు.
అయితే ఆ ఉద్యోగి మాత్రం తన్నులు తిన్నది తాను కాబట్టి .. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులకు తప్ప ఇలాంటి కేసులు చిన్న చిన్నవనుకునే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉద్యోగి … మనకెందుకు చెప్పు కష్టాలు… మూడు దెబ్బలేగా వదిలేస్తా పోలా అన్నట్లుగా మైండ్ సెట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఉద్యోగి పని చేస్తున్న జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇదంతా మంత్రి అంబటి రాంబాబు పర్యటన నేపధ్యంలో జరిగింది. అయితే ఎమ్మెల్యే రాజా … ఇంజినీర్‌పై దాడి చేసినప్పుడు ఆయన మరో రూంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
వైసీపీ నేతలు ఇతరుల్ని కొడతాం.. తిడతాం.. దాడి చేస్తామన్న హెచ్చరికలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. కొంత మంది నేరుగా యాక్షన్‌లోకి వచ్చేస్తున్నారు. ఎవరిని పడితే వారిని కొట్టడానికి వెనుకాడటం లేదు. చట్టం వైసీపీ నేతలకు వర్తించదని పోలీసులు ఇప్పటికే వెసులుబాటు ఇచ్చేశారేమో కానీ చంపుతామని బెదిరిస్తున్న వారికి కూడా కావాల్సినంత స్వేచ్చ ఉంది. అందుకే… అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెలరేగిపోతున్నారు. కొడితే కొట్టించుకోవడమే కానీ.. కనీసం న్యాయంకోసం ప్రయత్నించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.