గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో జక్కంపూడి కుటుంబానికి కాస్త పట్టు ఉంది. మొదటి నుంచి వైఎస్ విధేయులుగా తర్వాత జగన్ నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జక్కంపూడి కుమారులలో ఒకరు అయిన గణేష్ వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. దానికి మాజీ ఎంపీ మార్గాని భరత్‌తో ఉన్న విబేధాలను కారణంగా చూపిస్తున్నారు కానీ.. తమ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండాలంటే.. భవిష్యత్ ఉన్న పార్టీవైపు ఉండాలని అనుకుంటున్నారు.
జక్కంపూడి రాజా జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజా నగరం నుంచి ఎమ్మెల్యేగా ఓ సారి గెలిచి ఇటీవల ఎన్నికల్లో జనసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ జక్కంపూడి గణేష్ మాత్రం రాజమండ్రిలో రాజకీయాలు చేశారు. అక్కడ తమ కుటుంబానికి పట్టు తగ్గకుండా చూసుకున్నారు. ఎంపీగా తనకు సామర్థ్యం సరిపోవడం లేదని ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని చెప్పి భరత్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నారు. ఇది జక్కంపూడి కుటుంబానికి నచ్చలేదు.
రెండు వర్గాలకు ముందు నుంచీ.. వివాదాలున్నాయి. మార్గాని భరత్ కు జగన్ వైపు నుంచి ఎక్కువ సపోర్టు లభించింది. దీంతో జక్కంపూడి కుటుంబం ఏదో ఒకటి చేయాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ముందుగా ఒకరిని జనసేనలోకి పంపాలని అనుకుంటున్నారు. దానికి గాను గణేష్‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. వైసీపీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైతే.. అందరూ అదే పార్టీలో చేరిపోవాలన్న ఆలోచనతోనే ముందస్తుగా గణేష్ ను జనసేనలోకి పంపుతున్నారని అంచనా వేస్తున్నారు.