పిట్టపోరు పిల్లి తీర్చిందంటున్నట్లుగా అయింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ. ఎలాంటి లొల్లి లేకుండా ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసేవాళ్లు ఉండేవారు కాదు. కానీ రాజకీయం కోసం.. రెండు అధికార పార్టీలు కూడబలుక్కుని.. కొన్ని రోజులు.. నీళ్ల ఫిర్యాదులు చేసుకోవడంతో.. ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ఫిర్యాదుల్ని రెండు రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోకపోయినా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. పదే పదే గుర్తు చేస్తున్నారు. అధికారిక లేఖలు పంపుతున్నారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామన్నారుగా ఎప్పుడు ఇస్తారంటూ.. రిమైండర్లు పంపుతున్నారు. ఇట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందే అంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త చిక్కులు ప్రారంభమవుతున్నాయి.
గత అక్టోబర్‌లో తెలుగు రాష్ట్రాలతో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించారు. అందులో తమవన్నీ సక్రమ ప్రాజెక్టులేనని .. డీపీఆర్‌లు ఇస్తామని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు. మూడు నెలలు గడిచిపోయినా ఇంత వరకూ డీపీఆర్‌లు పంపలేదు. దీంతో.. అక్టోబర్ 6నాటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం అమలు చేయాలని ఆదేశిస్తూ..షెకావత్ తాజాగా లేఖ రాశారు. తెలంగాణ చేపట్టిన కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు, ఏపీ చేపట్టిన కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లను సమ్పించాలన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ.. డీపీఆర్‌లు సహా అన్ని రకాల అనుమతులు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలపై ఓ డీపీఆర్ పంపింది. కానీ అందులో ఏ వివరాలు లేకపోవడంతో వెనక్కి పంపింది. దీంతో అన్నింటికీ డీపీఆర్‌లు పంపాలని షెకావత్ కోరుతున్నారు.
ఇటీవల తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటనలో కాళేశ్వరం మూడో టీఎంసీకి అనుమతి కోరినట్లుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే ఏపీ కూడా.. కొన్ని ప్రాజెక్టులు నిర్మి్సతోంది. వీటికి సంబంధించి ఎలాంటి డీపీఆర్‌లు సమర్పించలేదు. గొడవలు పడకుండా ఎవరి ప్రాజెక్టులు వారు నిర్మించుకుందామన్నా.. చాన్స్ లేకుండా పోయింది. అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని కేంద్రమంత్రి డిమాండ్ చేస్తున్నారు. డీపీఆర్‌లు ఇస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయని ప్రభుత్వాలు భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే .. డీపీఆర్ ఇవ్వడానికి సిద్ధపడటం లేదు.