వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లే. పార్టీ ఫిరాయించినందుకు స్పీకర్లు చర్య తీసుకుని అనర్హత వేటు వేయడం అనే వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం ఉండదు గనుక, ఎటూ తాము వచ్చింది అధికార పార్టీలోకే గనుక నిశ్చింతగా కాలం గడుపుతున్న ఆ పదిమంది ఎమ్మెల్యేల్లో 9 మందికి ఇప్పుడు కొత్త గుబులు పట్టుకుంది. ఆ టెన్షన్ జగన్మోహనరెడ్డి కొత్తగా వారి మీద వేటు వేయించడానికి పావులు కదపడం వల్ల వచ్చిన టెన్షన్ కాదు. తమ తోటి సహచరుడు విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్.. అత్యుత్సాహంతో చేసిన ప్రకటన ద్వారా వచ్చిన టెన్షన్ మాత్రమే.
జలీల్‌ఖాన్ శనివారం నాడు విజయవాడలో తన బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సహజంగానే జగన్‌ను తిట్టిపోస్తూ.. చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. జగన్‌కు ఎమ్మెల్యేలంటే గౌరవం లేదని, అందుకే ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు చెట్టునుంచి రాలేకాయల్లాగా రాలిపోతున్నారని కూడా అభివర్ణించారు. ప్రపంచంలోనే ఎన్నదగిన నాయకుల్లో చంద్రబాబు ఒకరంటూ కీర్తించారు. ఇంతవరకూ బాగానే ఉంది. గతంలో వైకాపాలో ఉండగా కూడా అదేస్తాయిలో చంద్రబాబును కీర్తించిన ఘనత ఆయనకు ఉంది. చంద్రబాబును మించిన పరిపాలన దక్షుడు లేడని ఆయన అప్పట్లోనూ సెలవిచ్చారు. ఇవాళ కూడా అన్నారు. అంతవరకు పర్లేదు గానీ..
తాను ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యేను అని, జగన్ కరుణ తనకు అక్కర్లేదని, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, చంద్రబాబునాయకత్వంలో మళ్లీ పోటీచేసి గెలిచి సభలో అడుగు పెడతానని జలీల్‌ఖాన్ భీషణమైన ఒక ప్రతిజ్ఞ చేశారు. సరిగ్గా ఈ ప్రకటనే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఎటూ పదవులు పోవు, ఎన్నికలు రావు అని ఫిరాయించిన 9 మంది కూడా రోజులు గడుపుతున్నారు. అలాంటిది జలీల్‌ఖాన్ రాజీనామా చేస్తే గనుక.. వారందరి మీద కూడా నైతికంగా రాజీనామా చేయాల్సిన బాధ్యత పడుతుంది. అయితే ఫిరాయించిన అందరిలోనూ తిరిగి ఎన్నికలకు వెళ్లడానికి, ఒకే రకమైన ధైర్యం ఉండకపోవచ్చు. అందుకే జలీల్‌ఖాన్ తమకు లేనిపోని పితలాటకం తెచ్చిపెట్టాడని వారు అనుకుంటే ఆశ్చర్యం లేదు.
అయితే జలీల్ ఖాన్ రాజీనామా లేఖ రాసినంత మాత్రాన ఎన్నికలు వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. సదరు రాజీనామా లేఖను స్పీకరు ఆమోదించడం అనే ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. అది ఒక పట్టాన తేలదు అనే సూత్రాన్ని తెలంగాణ అసెంబ్లీ ఉదాహరణగా మనకు నేర్పింది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవ్వరూ చింతించనక్కరలేదు అని వాదిస్తున్న వారు కూడా ఉన్నారు.