భారతీయ సినిమా రంగంలో మలయాళం సినిమా ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంటుంది. వాళ్ల దగ్గర బడ్జెట్లు లేకపోవొచ్చు. కానీ.. ఆలోచనలున్నాయి. ఎవరికీ తట్టని ఆలోచనలు, తట్టినా.. చెప్పలేని కథలు వాళ్లు ధైర్యంగా చెప్పేస్తారు. ఈమధ్య మలయాళంలో వచ్చిన కథలు, వాటిని ఆవిష్కరించిన పద్ధతీ చూస్తే.. ఆశ్చర్యం వేయక మానదు. అందుకే మనవాళ్లు మలయాళం సినిమాలపై పడ్డారు. ఆ కథల్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. కోట్లు పెట్టి కొన్నా – మనం కూడా తీయలేని కొన్ని కథలు అక్కడా ఇంకా ఉన్నాయి. అలాంటి వాటిలో ‘జల్లికట్టు’ ఒకటి. గతేడాది విడుదలైన సినిమా ఇది. స్టార్లు లేరు. బడ్జెట్లు లేవు. కానీ.. విమర్శకుల ప్రశంసలు పొందింది. కొత్తగా సినిమా తీయాలనుకున్నవాళ్లకు ఓ దారి చూపించింది. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఇప్పుడు ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథని సింపుల్‌గా చెప్పాలంటే.. భైరవ కొండ అనే అటవీ ప్రాంతం అది. అక్కడి వాళ్లంతా గొడ్డుమాంసం ప్రియులే. ముక్క లేనిదే ముద్ద దిగదు. పెళ్లిళ్లూ, పేరంటాలలో విస్తట్లో ముక్కల విందు జరగాల్సిందే. ఊరి జనాలకు మాంసం సప్లై చేస్తుంటాడు ఆంటోనీ. ఓరోజు.. అడవి దున్న ని కబేళాకి తరలించి, దాని మాంసం విక్రయిద్దాం అనుకునేలోపు.. అది తప్పించుకుంటుంది. అడవిని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూ.. దాగుడుమూతలు ఆడుతుంది. ఆ దున్నని పట్టుకోవడానికి ఊరు ఊరంతా తరలి వస్తుంది. దాన్ని చంపి.. తమ వాటా మాంసం పట్టుకుపోవాలన్న ఆశతో. మరి ఆ దున్న దొరికిందా? ఈలోపు ఏం జరిగింది? ఎంత నష్టపరచింది? అన్నదే కథ.
అసలు ఇలాంటి కథతో సినిమా తీయగలరా? సినిమాకి సరిపడా కథేనా అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. మన దగ్గర ఈ కథ చెబితే `షార్ట్ ఫిల్మ్‌కి అయితే ఓకే` అంటారేమో. కానీ 90 నిమిషాల సినిమాగా మలిచాడు దర్శకుడు. కథని మొదలెట్టే విధానం చూస్తే వంశీ, భారతీ రాజాల స్టైల్ కనిపిస్తుంది. కేరళలోని ఓ మారు మూల ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టేశాడు దర్శకుడు. గొడ్డు మాంసం ప్రస్తావన, వాటిని చూపించిన పద్ధతీ చూస్తే – కాస్త యావగింపు కలుగుతుంది. కానీ.. ఈ కథకి మూలం అదే కాబట్టి దాన్ని భరించాలి. ఆ తరవాత.. కథనంలో వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.కేవలం అడవిదున్నని పట్టుకునే ప్రయత్నం మాత్రమే కాదది. రెండు పాత్రల మధ్య ఆధిపత్య పోరు కూడా. `ఇది వరకు ఈ అడవుల్లో మృగాలుండేవి.. ఇప్పుడు రెండు కాళ్లతో నడుస్తున్న మృగాలు కనిపిస్తున్నాయి` అని ఓ పాత్రతో పలికించాడు దర్శకుడు. ఈ కథ కాన్సెప్ట్ కూడా అదే అనిపిస్తుంది. మనిషిలోని ఆశనీ, అత్యాసనీ ఈ కథ టార్చిలైట్ వేసి చూపిస్తుంది. కేవలం ఓ అడవి దున్న వేటలా ఈ కథని చూడలేం. అంతర్లీనంగా చాలానే ఉంది. చివరి షాట్ ని అర్థం చేసుకోగలిగితే.. దర్శకుడి భావనల్లో లోతు స్పష్టం అవుతుంది.
అడవి.. ఓ దున్నపోతు.. దాని వెంట పడిన వందలాది మంది జనం – వీటితో కథనాన్ని రసవత్తరంగా వండాడు దర్శకుడు. మధ్యమధ్యలో కాస్త వెటకారం కూడా ఉంటుంది. సుదీర్ఘంగా సాగే షాట్లు చాలా ఎక్కువ. దాని కోసం ఎంత కష్టపడి ఉంటాడో అనిపిస్తుంది. అడవుల్లో షూటింగ్ సామాన్యమైన విషయం కాదు. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రాత్రి టార్చ్ లైట్ వెలుగుల్లో తీసిన సన్నివేశాలు.. ఫొటోగ్రఫీ నైపుణ్యానికి నిదర్శనం. ఇక సౌండ్ క్వాలిటీ అయితే అబ్బుర పరుస్తుంది. కొత్తరకమైన సౌండింగ్ వినే అవకాశం లభించింది. ఎడిటింగ్ కీ మంచి మార్కులు పడతాయి.
నటీనటుల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో గానీ… సినిమా చూశాక.. పాత్రధారులెవరన్నది గుర్తుకు రాదు. ఆ పాత్రలు తప్ప. ఊరి మనుషుల్లో ఉన్న కర్కశత్వాన్ని, ఆశనీ… చక్కగా పలికించారంతా. కొన్ని కథలన్ని మళ్లీ మళ్లీ తీయలేం. రీమేక్ రైట్స్ కొనుక్కున్నా ఈ కథని మళ్లీ తెరకెక్కించడం కష్టం. సన్నివేశాల్లోని `రా`నెస్ చాలామందికి ఎక్కకపోవొచ్చు. టెక్నికల్‌గా చూస్తే ఈ సినిమా తప్పకుండా మెట్టుపైనే ఉంటుంది. కొత్త తరహా సినిమాలు చూడాలనుకున్నవాళ్లకు `జల్లికట్టు` తప్పకుండా నచ్చుతుంది.