తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5
తిరుపతి లడ్డూ.. తిరుపతి గుళ్లోనే కొనాలి.
అమలాపురంలోనో, పెద్దాపురంలోనో దానికి డూప్లికేట్ తయారు చేసి ‘ఇదీ తిరుపతి లడ్డూనే’ అంటే….. దానికి ఆ రుచి వస్తుందేమో గానీ, పవిత్రత మాత్రం రాదు.
పాత సినిమా పేర్లూ అంతే. వాటిని వాడుకునేటప్పుడు, తమ కథలకు తగిలించుకునేటప్పుడు భలే బాగుంటుంది.
కోటి రూపాయలు విలువ చేసే పబ్లిసిటీ.. ఫ్రీగా ఆ ఒక్క పేరుతో వచ్చేస్తుంది. కానీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వడం… దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే మ్యాజిక్ ఒక్కసారే జరుగుతుంది. దాన్ని చూసి, మనమూ అలాంటి మ్యాజిక్కే చేద్దామనుకుంటే.. నవ్వుల పాలవుతాం. ‘జంబలకిడి పంబ’ ఈవీవీ కెరీర్లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. ఆ పేరు అప్పుడు భలే అనిపించింది. ‘ఈ టైటిలేదో విచిత్రంగా ఉందే’ అంటూ ఆశ్చర్యపోయి జనాలు థియేటర్లకు వెళ్లారు. అక్కడ.. ఆడవాళ్లని మగవాళ్లుగా, మగవాళ్లని ఆడవాళ్లుగా మార్చి ఇంకాస్త విచిత్రం చూపించాడు ఈవీవీ. దాంతో టైటిల్ సూపర్ హిట్టూ, సినిమా డూపర్ హిట్టూ అయిపోయాయి. ఇప్పుడు అదే టైటిల్‌ని శ్రీనివాసరెడ్డి తగిలించుకున్నాడు. పాత టైటిల్‌పై ఉన్న గౌరవం, శ్రీనివాసరెడ్డిపై ఉన్న నమ్మకంతో… ‘ఇదేదో చూడాల్సిన సినిమా’ అనిపించింది. మరి… అంతగా సూడాల్సిన సరుకు… సిత్రాలు ఇందులో ఉన్నాయా? జంబలకిడి.. కామెడీ పలికిందిందా??
కథ
వరుణ్ (శ్రీనివాసరెడ్డి), పల్లవి (సిద్ది) ఇద్దరూ ప్రేమించి, పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఎంత త్వరగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారో, అంతే త్వరగా విడిపోవాలనుకుంటారు. ఎందుంకటే వరుణ్‌పై పల్లవికి అనుమానం. పల్లవి చేసే నానా యాగీ అంటే వరుణ్‌కి చిరాకు. అందుకే… విడాకులు ఇప్పించడంలో ఫేమస్ లాయర్‌గా పేరు తెచ్చుకున్న హరిశ్చంద్ర ప్రసాద్( పోసాని)ని కలుస్తారు. ఆయన అప్పటికే 99 జంటలతో విడాకులు ఇప్పించి.. సెంచరీకి దగ్గర పడతాడు. అయితే ఈ కేసు డీల్ చేస్తున్నప్పుడే ఓ ప్రమాదంలో తన భార్యతో సహా మరణిస్తాడు. స్వర్గంలో తన భార్యతో విరహాన్ని తట్టుకోలేడు. ఇదేం శిక్ష దేవుడా? అని అడిగితే ‘భూమ్మీద అన్ని జంటల్ని విడగొట్టిన పాపమే ఇది.. నీ పాపం కడుక్కోవాలంటే ఒక్కటే మార్గం.. వరుణ్, పల్లవిలను కలుపు’ అని దేవుడు… హరిశ్చంద్ర ప్రసాద్‌ని భూమ్మీదకు పంపుతాడు. తన తప్పుల్ని తెలుసుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ వరుణ్ పల్లవిలని కలపడానికి ఏం చేశాడు? వరుణ్ని అమ్మాయిగా, పల్లవిని అబ్బాయిగా ఎందుకు మార్చాడు? అనేదే కథ.
విశ్లేషణ
1993లోనే ఈవీవీ ఎంత అడ్వాన్సుగా ఆలోచించాడో, ఆ సినిమా ఎంత బాగా తీశాడో అనిపిస్తుంది ఇప్పటి `జంబలకిడి పంబ`ని చూస్తుంటే. మగవాళ్లపై కోపంతో వాళ్లందరినీ ఆడవాళ్లుగా మార్చేస్తుంది హీరోయిన్. హీరో వాళ్లని మగవాళ్లుగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నాల్లోంచి పుట్టిన ఫన్ అంతా ఇంతా కాదు. కామెడీ సినిమాల్లో అదో ట్రెండ్ సెట్టర్. అంత కాకపోయినా… అందులో కొంతయినా ఇప్పటి జంబలకిడి పంబలో ఉంటుందనుకుంటారు. కానీ.. దర్శకుడు `పేరు`ని మాత్రమే వాడుకున్నాడని, అప్పటి తెలివితేటల్ని కాదని పది నిమిషాలు సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఆడది మగవాడిగా, మగాడు ఆడదానిగా మారిపోవడం – అప్పటి జంబలకిడి పంబ. అమ్మాయి శరీరంలో అబ్బాయిని, అబ్బాయి శరీరంలో అమ్మాయినీ పంపండం ఇప్పటి జంబలకిడి పంబ. నిజంగా దర్శకుడికి స్టామినా ఉంటే… ఈ ఫ్లాట్ నుంచి కూడా కావల్సినంత వినోదం పండించొచ్చు. ఆ ఛాన్స్‌ని పేలవమైన కథనంతో పాడు చేసుకున్నాడు. వరుణ్, పల్లవిల మధ్య గొడవ, విడిపోవడానికి చేసే ప్రయత్నాలు ఇవేం రక్తి కట్టలేదు. ‘పెళ్లైన కొత్తలో’ సినిమాని శ్రీనివాసరెడ్డి వెర్షన్లో చూసినట్టు అనిపిస్తుంది. పోసానిని చంపేసి, స్వర్గానికి పంపి, అక్కడ తన తప్పుని తెలుసుకొనేలా చేసి భూమ్మీదకు పంపిన వైనం కూడా అంతే నీరసంగా సాగుతుంది. 99 జంటలపై దేవుడికి లేని ప్రేమ… ఈ వందో జంటపై ఎందుకు కలిగిందో స్పష్టంగా చెప్పలేదు. కామెడీ, సైన్స్ ఫిక్షన్ అనుకున్న సినిమా కాస్త.. ఈ ఎత్తుగడతో ఫాంటసీగా మారిపోయింది. తొలి సగం గడిచినప్పుడే `ఈ సినిమాలో విషయం లేదు` అన్న సంగతి అర్థమైపోతుంది. కాకపోతే ఈ సినిమాకి బలం సెకండాఫ్‌లో ఉంది. అమ్మాయి అబ్బాయిగా, అబ్బాయి అమ్మాయిగా మారడంలోనే వినోదపు గుట్టు ఉంది.కాబట్టి.. సెకండాఫ్ పాసైపోతుందే అనుకుంటారు. కానీ.. దర్శకుడు ఇక్కడ కూడా సరైన సన్నివేశాలు రాసుకోలేదు. ఆఫీసు వ్యవహారాలు, పబ్బుల్లో చేసిన అల్లరి ఇవన్నీ బలవంతంగా రుద్దే ప్రయత్నాలుగానే కనిపిస్తాయి. కనీసం పాత `జంబలకిడి పంబ`ని ఫాలో అయిపోయినా – బాగుండేది. ఆ ఛాయలు పడకూడదు అని దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడేమో. కాకపోతే.. తన మార్క్ చూపించాలి కదా? ఆ విషయంలో దారుణంగా డింకీ కొట్టేశాడు. సినిమాల్లో ‘కామెడీ’ పండాలంటే ఒకట్రెండు సైడు ట్రాకులు రాసుకుంటారు. ప్రేక్షకుల్ని నవ్వించడానికి. సినిమాకి బలమే కామెడీ అనుకున్నప్పుడు ఆయా సన్నివేశాల్ని ఇంకెంత బాగా రాసుకోవాలి..? దర్శకుడిలో కామెడీ టింజ్ ఉన్నప్పుడే ఇలాంటి ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయి. అదేం లేకపోతే… పేలవమైన కథనాన్ని నమ్ముకుంటే అచ్చం ఇలానే పేలిపోతాయి.
నటీనటులు
అమ్మాయి పాత్రలో శ్రీనివాస రెడ్డి ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే చూడగలం. తన అనుభవానికి టైమింగ్ ని రంగరించి ఉన్నంతలో ఈ సినిమాని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. అబ్బాయిగా సిద్ది నటన దానికి పూర్తి విరుద్ధంగా సాగింది. శ్రీనివాసరెడ్డి కి జంటగా అయితే ఈ అమ్మాయిని అస్సలు చూడలేం. పోసాని పాత్రలు ఒక్కోసారి భలేగా సెట్టవుతాయి. గీత దాటకుండా గ్రిప్పింగ్ లో పోసానిని నడిపించాలి. ఆ గీత దాటితే పోసాని కూడా చిరాకు పెట్టేస్తాడు. ఈ సినిమాలో అదే జరిగింది. పోసాని ఓవరాక్షన్‌కి హద్దులేదా? అన్న రీతిలో సాగింది నటన. వెన్నెల కిషోర్ కూడా ఏమీ చేయలేకపోయాడంటే – కచ్చితంగా అది రైటింగ్ లోపమే.
సాంకేతికంగా..
దర్శకుడు నమ్ముకున్నది కథని కాదు. పాయింట్‌ని. అది పేపర్ పై చూడ్డానికి బాగానే ఉంది. దాన్ని రెండు గంటల సినిమాగా నడపాలంటే… బోల్డంత క్రియేటివిటీ కావాలి. కనీసం పది నిమిషాలకు ఓసారి.. ప్రేక్షకుల్ని నవ్వించాలి. ఆ నవ్వుల్లో మైనస్సులు కూడా ప్లస్సులైపోతాయి. అప్పటి జంబలకిడిపంబలో.. మగవాళ్లంతా ఆడవాళ్లుగా మారిపోవడం ఇబ్బందిగా అనిపించలేదు. లాజిక్‌కి దూరంగా కనిపించలేదు. దానికి కారణం… ఈవీవీ సృష్టించిన ఫన్. అది ఇక్కడ మిస్సయ్యిందంటే.. దర్శకుడిలో లోపమే అని చెప్పుకోవాలి. గోపీ సుందర్ పాటలు వినడానికి బాగున్నా.. ఈ కథకూ, నటీనటులకూ అస్సలు సూట్ కాలేదు. గంపెడు హాస్యనటులున్నా చిటికెడు నవ్వులు కూడా పూయలేదంటే.. అదంతా రచయిత లోపమే. సాంకేతిక నైపుణ్యాలూ అంతంత మాత్రంగానే కనిపించాయి.
తీర్పు
పాత సినిమా టైటిళ్లని వాడుకునే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిందే – అని మరోమారు హెచ్చరించిన సినిమా ఇది. కేవలం లైన్‌ని మాత్రమే నమ్ముకుని బరిలో దికకండి అని చెప్పడానికి మరో ఉదాహరణ. హాస్యనటులు హీరోలుగా మారడం అంత తేలిక కాదని, సరైన కథ, కథనాలు, పాత్రీకరణ లేకపోతే ఎంతటి హాస్యనటుడైనా ఏమీ చేయలేడని – జంబలకిడి పంబ నిరూపించింది.
ఫైనల్ వర్డిక్ట్: పేరు చూసి మోసపోకండి
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5