అల్లరి నరేష్, సాక్షి చౌదరి జంటగా నటించిన `జైమ్స్ బాండ్ – నేను కాదు నా పెళ్ళాం’ చిత్రం చూడగానే విదేశీ సినిమాలతో పరిచయం ఉన్నవారికి వెంటనే స్ఫురించేపేరు `మై వైఫ్ ఈజ్ ఏ గాంగ్ స్టర్’. ఇది కొరియన్ సినిమా. ఈ విదేశీ సినిమా స్ఫూర్తితో అల్లరి నరేష్ తో నిర్మాత రామబ్రహ్మం సుంకర జేమ్స్ బాండ్ అందించారు. సాయి కిషోర్ తెలుగు నెటివీటీని తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. నాని పాత్రలో అల్లరి నరేష్ తెరపై చాలా కంగారుపడుతూ చేసే చేష్టలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. అతనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తన కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకూడదనుకునే సగటు మనిషి. కానీ లేడీడాన్ బులెట్ (సాక్షి చౌదరి)ని పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. `కత్తిలాంటి అమ్మాయి అనుకుంటే చివరకు కత్తినే చేసుకున్నా’నని తెగఫీలైపోతాడు. సినిమా టైటిలే కథ ఎలాఉంటుందో చెప్పేసింది కాబట్టి ఇక ప్రేక్షకునికి ఉత్కంఠ కలిగించడమన్నది ఉండదు.
హాయిగా ఏంజాయ్ చేద్దామనుకునేవారికి ఇదో చక్కటి సినిమా. పైగా బాహుబలి వంటి మంచి చందమామ కథను వెండితెరపై చూసిన తర్వాత ప్రేక్షకుణ్ణి ఆ భారీ ఊహల నుంచి కిందకు దించి కితకితలు పెట్టించిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.
భారీ బడ్జెట్ తో తీసిన బహుభాషా చిత్రం బాహుబలి సినిమా పక్కనే ఈ సినిమాను రిలీజ్ చేయాలంటే కాస్తంత సాహసం కావాల్సిందే. మహేష్ చిత్రం `శ్రీమంతుడు’నే వాయిదా వేసుకున్న పరిస్థితుల్లో జేమ్స్ బాండ్ ని విడుదలచేయడంలో నరేష్ పట్ల నిర్మాత, దర్శకునికి ఉన్న నమ్మకం స్పష్టంగా కనబడుతోంది. అల్లరి నరేష్ ఖాతాలో ఇదో మంచి చిత్రంగా మిగిలిపోతుందనే చెప్పుకోవాలి.
ఎక్కువగా ఆలోచించకుండా థియేటర్ కు వెళ్ళి చూస్తే ఈ సినిమా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. బాహుబలి కబుర్లు వినీవిని బోర్ కుట్టిందనుకుంటే, మార్పు కోసం కూడా ఈ సినిమాకు వెళ్లొచ్చు. ఇదో టైమ్ పాసర్ అనుకుంటే సరి.
– కణ్వస