తెలుగుదేశం పార్టీలో సీట్ల సర్దుబాటు కసరత్తును.. చంద్రబాబునాయుడు వేగవంతం చేశారు. రోజూ.. ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా కొంత సమయం దీని కోసమే కేటాయిస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసినప్పటికీ.. చేరికలతో సంక్లిష్టంగా మారిన నియోజకవర్గాలు మాత్రం… చంద్రబాబుకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో మొదటిది.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం. దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ వర్గాలను నడిపి… ప్రత్యర్థులుగా కన్నా..శత్రువులుగా ఎక్కువ కాలం గడిపిన ఆదినారాయణరెడ్డి, రామ సుబ్బారెడ్డి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. రామసుబ్బారెడ్డి.. టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఇద్దరూ టీడీపీలో ఉండటం వల్ల ఒక్కరికే టిక్కెట్ వస్తుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు చిక్కు ప్రశ్న..!
కొద్ది రోజులుగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… జమ్మలమడుగు పంచాయతీని పరిష్కరించేందుకు
ప్రయత్నిస్తున్నారు. ఒకరు జమ్మలమడుగు అసెంబ్లీకి.. మరొకరు కడప పార్లమెంట్‌కు పోటీ చేయాల్సి ఉంటుందని ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని… వారికి చెప్పేశారు. కొంత మంది పార్టీ నేతలకు ఇద్దరు నేతల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను అప్పగించారు. చాలా రోజుల నుంచి… ఆ నేతలు సమన్వయం కోసం ప్రయత్నం చేస్తున్నా… ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇద్దరికీ..అసెంబ్లీ టిక్కెట్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. పార్లమెంట్ కు పోటీ చేయడానికి సిద్ధపడటం లేదు. ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారు. జమ్మలమడుగుకు దూరం జరిగితే.. మొత్తానికే పట్టుకోల్పోతామని భయపడుతున్నారు.
గత వారం రోజుల్లో చంద్రబాబుతో.. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మూడు సార్లు సమావేశం అయ్యారు. ఈ రోజు కూడా… ఉదయమే.. చంద్రబాబుతో చర్చలు జరిపారు. కానీ ఏ విషయం తేలలేదు. కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు… ఆదినారాయణకు ఆ జిల్లా బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారు. కడప లోక్‌సభా నియోజకవర్గం మొత్తం ఆయనకే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా.. ఆయన మాటకే విలువ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణరెడ్డి పట్టుబడితే.. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ పంచాయతీ నామినేషన్ల వరకూ కొనసాగినా ఆశ్చర్యం లేదనేది … టీడీపీ నేతలు చెబుతున్నమాట…!