జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ఎవరు పోటీ చేయాలన్న పంచాయతీని చంద్రబాబు ఎట్టకేలకు తేల్చారు. ఓ ఫార్ములాకు.. అటు ఆదినారాయణరెడ్డి, ఇటు రామసుబ్బారెడ్డి కూడా అంగీకరించడంతో… సమస్య పరిష్కారం అయినట్లియంది. ఈ ఫార్ములా ప్రకారం.. రామసుబ్బారెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తారు. ఆది నారాయణరెడ్డి కడప లోక్ సభకు పోటీ చేస్తారు. మంత్రివర్గ సమావేశానికి ముందు చంద్రబాబు వీరితో గంట సేపు చర్చించారు. ఇద్దరి మధ్య కుదిరిన ఫార్ములా ప్రకారం.. రామసుబ్బారెడ్డి ఉన్న పళంగా.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారు. ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డికి ఇస్తారు. ఆదినారాయణరెడ్డి పార్లమెంట్ కు, రామసుబ్బారెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తారు. ఈ ఒప్పందం ప్రకారం.. రామసుబ్బారెడ్డి అక్కడికక్కడే… రాజీనామా లేఖను సీఎంకు అందించారు.
రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి రెండు దశాబ్దాలుగా.. రాజకీయంగా మాత్రమే కాదు.. ఫ్యాక్షన్ గొడవల్లో రెండు వర్గాలకు నేతృత్వం వహిస్తున్నారు. దశాబ్దాలుగా.. రెండు వర్గాల్లోనూ.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇటీవలి కాలంలో ఫ్యాక్షన్ గొడవలు, హత్యలు లాంటి ఘటనలు ఏవీ లేవు కానీ.. ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య పొసగని పరిస్థితి ఉంది. అయినప్పటికీ.. మెల్లగా పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు.. ఎదురెదురుగా వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత చాలా సందర్భాల్లో ఇద్దరూ కలసి ఒకే వేదికపై కనిపించడం ప్రారంభించారు. అలా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే పరిస్థితి వచ్చింది.
జమ్మలమడుగులో రెండు వర్గాలు ఏకమైతే.. పులివెందులలో వైసీపీకి వచ్చే మెజార్టీ కన్నా ఎక్కువే వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సారి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ గణనీయంగా తగ్గుతుందన్న అంచనాలో.. టీడీపీ ఉంది. ఎలాగైనా .. కడప పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో.. ఆదినారాయణ రెడ్డి అయితేనే బలమైన అభ్యర్థి అవుతారన్న అంచనాలో ఉన్నారు. చివరికి ఆయనను ఒప్పించారు. రెండు వర్గాలు కలసి పని చేస్తే.. కడప ఎంపీ సీటును.. గెలవడం.. అంత పెద్ద కష్టమేం కాదన్న అంచనాలో… కడప జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు.