జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి… తెలుగుదేశంలో ఎన్ని రోజులు ఉంటాడు? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. కొన్ని నెలల కిందట వైకాపాను వీడి తెలుగుదేశం కండువానుకప్పుకున్న ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి తెలగుదేశంలో ఉండటం కష్టమే.. అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ప్రస్తుతానికి అధికారంలో ఉంది కాబట్టి పబ్బం గడుపుకోవడానికి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కానీ, ఎన్నికల సమయానికి ఆయన బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా జై జగన్ అనగలడు.. అనేది గట్టిగావినిపిస్తున్న అభిప్రాయం.
మరి జగన్ తీరు నచ్చక.. జగన్ మనస్తత్వం నచ్చలేదు అంటూ తెలుగుదేశంలో చేరిన ఆయన.. తిరిగి జగన్ వద్దకు రావడం ఏమిటి? అంటూ ఆశ్చర్యపోవచ్చు. ఇలాంటి ఆశ్చర్యాలు అన్నీ సామాన్యులకు కానీ, రాజకీయ నేతలకు కాదు! వాళ్లు ఏ పూట ఏమైనా మాట్లాడగలరు. ప్రస్తుతానికి తెలుగుదేశం చేతిలో అధికారం ఉంది, చంద్రబాబుకు తనను ఆహ్వానించాడు.. అందుకే ఆదినారాయణ రెడ్డి అక్కడ చేరాడు, రేపు ఎన్నికలనుతెలుగుదేశం నుంచి ఎదుర్కొనడం కష్టం.. జమ్మలమడుగులో సైకిల్ గుర్తుకు ఓట్లు పడటం కష్టం. అక్కడ వైఎస్ కుటుంబానికి, జగన్ కు మంచి ఆదరణ ఉంటుంది..రేపు మళ్లీ గెలవాలంటే అటు వైపు వెళ్లక తప్పని పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి అటువైపు వెళ్లిపోగల సమర్థుడు!
ఇది ఈయనకు కొత్తేమీ కాదు.జగన్ కాంగ్రెస్ ను వీడిన కొత్తలో ఆది నారాయణ రెడ్డి జగన్ కు మద్దతుదారుగానిలిచాడు. అయితే కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాకా.. ఈయన ప్లేటు ఫిరాయించాడు. జగన్ కు పూర్తిగా దూరమై.. కిరణ్ కు సన్నిహితుడు అయ్యాడు. ఎన్నికల సమయం వరకూ జగన్ ఇంటి ఛాయలకు రాలేదు ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి సోదరుడు అప్పటికే జగన్ వద్దకు చేరి ఎమ్మెల్సీ పదవిని పొందాడు. ఆయన వైకాపాలో, ఆది కాంగ్రెస్ లో ఉండి.. ఎన్నికల నాటికి జగన్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే టికెట్ ను పొందాడు ఆది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉందనేది కడప జిల్లా స్థాయిలో వినిపిస్తున్న అభిప్రాయం. మరి ఆదినారాయణ రెడ్డి ఆడే ఈ గేమ్ లోవెర్రివాళ్లు అయ్యేది ఎవరు? జగనా? ఆదికి పచ్చకండువా వేసిన చంద్రబాబా?