కొన్నాళ్లుగా జమ్మలమడుగు పంచాయితీ టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి… ఇద్దరూ టీడీపీలోనే ఉంటున్నా, కనీసం కలిసి మాట్లాడుకున్న పరిస్థితులు ఇన్నాళ్లూ లేవు. దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా పరస్పర విరోధులుగా ఉంటూ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ పంచాయితీకి ఒక ముగింపు లభించింది. ఈ ఇద్దరూ ఒకే ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చివరికి… జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేట్టు, కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నట్టుగా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలనీ, ఖాళీ అయిన ఆ స్థానంలో ఆది నారాయణ రెడ్డి సోదరుడికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారనీ సమాచారం.
కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న ఈ ఇద్దరి మధ్యా సయోధ్యకి సీఎం ప్రయత్నం ఫలించిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే, కడప ఎంపీ స్థానానికి ఆదినారాయణ రెడ్డిని పెట్టడం ఓరకంగా సాహసోపేతమైన నిర్ణయమే అనొచ్చు. ఎందుకంటే, కడప పార్లమెంటు నియోజక వర్గంలో వైకాపాకి మంచి పట్టుంది. అయితే, టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కచ్చితంగా ప్లస్ అవుతాయనేది ముఖ్యమంత్రి నమ్మకం. ఇదే అంచనాతో ఆదినారాయణ రెడ్డిని సీఎం ఒప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప ఎంపీ స్థానం పోటీ విషయంలో పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆదినారాయణకి సీఎం భరోసా ఇచ్చినట్టూ సమాచారం.
ఈ ఇద్దర్నీ ఒప్పించడంలో చంద్రబాబు ఏ విధంగా సక్సెస్ అయ్యారంటే… రాజకీయాలు మారుతున్నాయనీ, తరాలు మారుతున్నాయనీ, మీ తరువాతి రాజకీయాల్లోకి వస్తున్న పరిస్థితి ఉందనీ, ఇలాంటప్పుడు ఎప్పటివో రాజకీయ కక్షలను పెట్టుకుంటే ఇద్దరూ నష్టపోతారని సీఎం చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ఇద్దరూ చేతులు కలిపితే కడపలో మంచి ఫలితాలు సాధించవచ్చని నచ్చజెప్పడంతో ఆది నారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా, టీడీపీలో ఈ మధ్య తీవ్రమైన చర్చనీయాంశమైన ఈ పంచాయితీకి తెరపడ్డట్టే.