తెలుగు తెర పై “కృష్ణుడంటే ఎన్టీయారే” ఎలాగో “సత్యభామ అంటే నటి జమునే” అలాగ. అంతే కాదు. మహానటి సావిత్రి తో అనేక సినిమాల్లో నటించిన జమున సావిత్రి ల మధ్య చక్కని అనుబంధముంది. తనని సావిత్రి ఎప్పుడూ “చెల్లీ” అని ఆప్యాయంగా పిలిచేదని చెప్తూంటారు జమున. ఇటీవల ఒక పత్రిక కి ఇచ్చిన సుధీర్గమైన ఇంటర్వ్యూలో మహానటి సినిమా గురించి వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమందంటే-
” సావిత్రి నాకు మంచి స్నేహితురాలు. చెల్లి అంటూ ఆప్యాయంగా పిలిచేది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి నాతో చెప్పుకునేది. పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని ఊరికే అనలేదు. నీ భర్త చూడు ఎంత బాగా చూసుకుంటున్నాడో, జెమినీ నన్ను మోసం చేశాడు అంటూ బాధపడింది. అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని సావిత్రికి తెలుసు. మేమూ చెబుతున్నాం. అయినా నమ్మింది. ఆమెకు చెన్నైలో వరుసగా మూడు ఇళ్లు ఉండేవి. సావిత్రి సంపాదించినంత మొత్తం చిత్ర పరిశ్రమలో ఎవరూ సంపాదించి ఉండరు. చెన్నైలో ఒక బంగళా అమ్మినా కోటి రూపాయలు వస్తుంది. మిగతావి అద్దెలు వస్తాయి. పిల్లలతో హాయిగా ఉండు. భర్త విషయం మర్చిపో అని చెప్పాను. నీ ఆ జ్ఞాపకాలు వదలడం ఆమె వల్ల కాలేదు. చివరకు బాగా మద్యానికి బానిసైంది. కోమాలోకి వెళ్లిందని తెలిసి ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడు అంజయ్య ముఖ్యమంత్రి. ఆయనతో మాట్లాడి అమెరికా వైద్యం కోసం పంపించేందుకు ఏర్పాట్లు చేయించాను. వైద్యులు అక్కడిదాకా ప్రయాణం చేసే స్థితిలో సావిత్రి లేదన్నారు. చివరకు ఎవరూ లేని దానిలా కన్నుమూసింది. ఈ మధ్య ఎవరో దర్శకుడు సావిత్రి జీవిత కథతో సినిమా చేస్తున్నారని విన్నాను. ఆమె గురించి అతనికి ఏం తెలుసని సినిమా రూపొందిస్తున్నాడో తెలియదు. ఆమెతో అనుబంధం ఉండి బతికున్న ఒకే ఒకదాన్ని నేను. నాలాంటి వాళ్లను కనీసం సంప్రదించకుండా సినిమా చేస్తున్నారు. అయినా సావిత్రికి తెరరూపమివ్వ గల నాయికలు ఉన్నారా ఇప్పుడు. అసలు భాషే తెలియకుండా నటిస్తున్నారు. ”
ఇదండీ జమున గారి ఆవేదన. ఆవిడలాంటి వాళ్ళని కలిస్తే దర్శకుడు నాగ అశ్విన్ లాంటి వాళ్ళకి కూడా మరొక “దృక్పథం” పరిచయమయే అవకాశముంటుంది.