హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారా..? ఆయన భార్యనా..? అన్న ప్రశ్న మొదట్లో వినిపించింది. అయితే సీరియస్ నెస్ తగ్గుతుందని అనుకున్నారేమో కానీ.. అప్పటికీ ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసి.. ఈటలనే అభ్యర్థి అని అనిపించగలిగారు. ఈటల బీజేపీలో చేరడం.. తానే అభ్యర్థి అన్నంతగా…కష్టపడుతూండటంతో.. ఇక ఈటలపై నిలబడే అభ్యర్థి ఎవరు అన్నచర్చే ఇప్పటి వరకూ నడుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు.. మరోసారి.. అభ్యర్థిగా ఈటల భార్య పేరు ప్రచారంలోకి వస్తోంది. దీనికి కారణం ఆమె చేసిన వ్యాఖ్యలే. హుజూరాబాద్‌లో ఈటలకన్నా ఎక్కువగా గ్రామాలను చుట్టబెడుతున్న ఆమె.. అభ్యర్థి ఎవరైనా.. కమలం గుర్తు మీదే పోటీ చేస్తామని ప్రకటించి… కొత్త సందేహాలకు తావుచ్చారు.
మామూలుగా అయితే ఈటల రాజేందరే పోటీ చేస్తారు.. అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాల్సి ఉండేది. కానీ ఆమె అలా చెప్పకుండా తాను కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నట్లుగా మాట్లాడటంతో… బీజేపీ వ్యూహం మార్చిందన్న అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ గెలిస్తే బలమైన శక్తిగా ఎదుగుతారు. బీజేపీలోనూ గట్టి పట్టు సాధిస్తారు. ఓడిపోతే మాత్రం మొత్తం తలకిందులయిపోతుంది. ఓ రకంగా ఆయన రాజకీయ జీవితం ముంగిపు దశకు వస్తుంది. ఇంతటి క్లిష్టమైన పరిస్థితులు తెచ్చుకోవాలని అటు బీజేపీ కానీ.. ఇటు ఈటల కానీ అనుకోవడం లేదని అంటున్నారు. అందుకే.. ఈటల తన భార్యను నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈటల భార్య జమున రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆమె పోటీ చేస్తే రెడ్డి సామాజికవర్గం ఓట్లు.. అలాగే.. ఈటల రాజేందర్ సామాజికవర్గమైన ముదిరాజ్‌ల ఓట్లు.. వస్తాయని.. అలాగే.. ఇతర వర్గాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కోణం కూడా ఆలోచించి.. ఈటల రాజేందర్‌కు బదులుగా ఆయన భార్యను పోటీకి నిలపాలని ప్రాథమికంగా బీజేపీ నిర్ణయానికి వచ్చిందని.. ఆ సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకే కొత్తగా ఆమెతో ప్రకటనలు చేయిస్తున్నారని అంచనా వేస్తున్నారు.