కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టిజేఏస్ సీట్ల ఖరారు కాకుండా అడ్డు పుల్ల వేస్తున్నారు. మిర్యాలగూడ టిక్కెట్ విషయంలో.. ఆయన కోదండరాంతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. తన కొడుకుకు కాంగ్రెస్ టికెట్ దక్కకున్నా.. మరో బంధువుకు కూటమిలోని జనసమితి నుండి టికెట్ దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూటమి రాజకీయాల్లో చర్ఛనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో కూటమిలో తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి పొగ పెడుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. తెలంగాణ జన సమితికి కూటమిలో 8 సీట్లు ఇస్తామని అంగీకారం కుదిరింది. జన సమితి అడిగే సీట్లలో ప్రాధాన్యత ఉన్న సీటు మిర్యాలగూడ. కానీ ఆ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది.
ఆ సీటులో తనయుడ్ని నిలబెట్టేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో జానాకు పట్టుంది. ఆయన పోటీ చేస్తున్న నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది. గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి జానాకు మిర్యాలగూడ బెల్ట్ లో బలం ఉంది. అందుకే మిర్యాలగూడ సీటును తన కొడుకు రఘువీర్ రెడ్డికి, నాగార్జున సాగర్ తనకు కావాలని అడుగుతూ వచ్చారు. కానీ అధిష్టానం ససేమిరా అన్నది. ఒక కుటుంబానికి ఒక సీటు ఇస్తామని తేల్చింది. ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో జానారెడ్డి ప్లాన్ బి బయటకు తీశారు.
మిర్యాలగూడ సీటు కూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి ఖరారైంది. కానీ ఆ సీటులో తెలంగాణ జన సమితి చెబుతున్న అభ్యర్థి కాకుండా తాను సూచించిన అభ్యర్థిని నిలబెట్టాలంటూ జానారెడ్డి కోదండరాం పై వత్తిడి తెస్తున్నారు. అలా అయితేనే మిర్యాలగూడ సీటును గెలిపించేదుకు తాను పూచీ తీసుకుంటానని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. లేకపోతే తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. మిర్యాలగూడ సీటులో జన సమితి నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ కావాలని కోదండరాం పట్టుపడుతున్నారు. విద్యాధర్ రెడ్డి జెఎసి లో కీలక భూమిక పోషించారు.
కానీ జానారెడ్డి మాత్రం జన సమితిలోనే తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే తన కొడుకుకు లేదంటే తన వియ్యంకుడి సోదరుడికి కూటమి టికెట్ ఇప్పించుకోవాలన్న ప్రయత్నాల్లో జానారెడ్డి తలమునకలయ్యారు. జానారెడ్డి ప్రయత్నాలు జన సమితికి ఇబ్బందికరంగా మారాయి. జన సమితి మాత్రం విద్యాధర్ రెడ్డినే బరిలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. అవసరమైతే.. లోపాయికారీ మద్దతు ఇచ్చి బంధువును రెబల్‌గా బరిలోకి దింపాలన్న ఆలోచనలో… జానారెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.