హైదరాబాద్: సినిమా నటులు కొన్ని పాత్రలగురించి చెప్పేటప్పుడు, ‘ఈ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి’ అని చెప్పటం వింటుంటాము. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ఇవాళ కార్యకర్తలకు నిజజీవితంలో, ప్రత్యక్షంగా డిఫరెంట్ షేడ్స్ చూపించారు. వరంగల్ జిల్లా గణపురం మండలకేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అయితే వేదికపై కూర్చోకుండా తాను కార్యకర్తలమధ్య కూర్చుని వారు చెప్పేది వింటానని అన్నారు. అలాగే కార్యకర్తలమధ్య కూర్చున్నారు. ఇంతలో ఏమనుకున్నారో, వ్యక్తిగత సిబ్బందితో భగవద్గీత పుస్తకం తెప్పించుకుని చదువుతూ గడిపారు. కార్యకర్తలు మాటలు వింటానని మళ్ళీ ఈ భగవద్గీత చదవటమేమిటా అని అందరూ అనుకున్నారు.
సరే, అదొక ఎత్తయితే తర్వాత మీడియాతో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. మామూలుగే ముఖ్యమంత్రి కేసీఆర్ను పల్లెత్తు మాట అనరని, మిగిలిన కాంగ్రెస్ నాయకులుకూడా అనకుండా చూస్తున్నారని జానాపై విమర్శ ఉంది. అయితే ఇవాళ ఆ వైఖరికి భిన్నంగా కేసీఆర్పై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్కు పాలనా సామర్థ్యం లేదని, కల్లబొల్లి మాటలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారని మండిపడ్డారు. నిరుపేదలకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని, మాయమాటలతో గద్దెనెక్కిన పాలకులకు ప్రజలే తగిన రీతిలో బుద్ధిచెబుతారని అన్నారు. సచివాలయంమార్చుతా, ఉస్మానియా ఆసుపత్రి కూల్చుతా అంటూ పనికి మాలిన మాటలతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.
మామూలుగానే అర్థంకాని సూక్తులు చెప్పి ఎదుటివారిని తికమక పెడుతుంటారని ఆయనకు పేరు. దానికి తోడు ఇలా డిఫరెంట్ షేడ్స్కూడా చూపిస్తే పక్కనున్నవాళ్ళు బ్రహ్మానందంలా కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే.