టి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి తన ప్రయత్నాలు బాగానే చేస్తున్నట్టు తెలుస్తోంది! ప్రయత్నం అంటే.. అదేనండీ, పీసీసీ అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు! సీఎల్పీ కంటే పీసీసీ అధ్యక్ష స్థానంలో ఉండటమే మంచిదని ఈ మధ్య ఆయన డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దలతో తన మనసులో మాటను చెప్పి వచ్చినట్టుగా కూడా కథనాలు వచ్చాయి. పీసీసీ అధ్యక్ష స్థానంలో ఉండటం ద్వారా పార్టీలో మరింత క్రియాశీలంగా మారొచ్చు అనేది ఆయన వ్యూహం. అంతేకాదు, అధికార పార్టీ తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శ కూడా జానాపై ఉంది. సీఎల్పీకి దూరంగా ఉండటం ద్వారా ఆ అపవాదును కూడా వదిలించుకోవచ్చని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే పీసీసీ కోసం రాష్ట్రస్థాయిలో నేతల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ప్రస్తుతం జానా ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష స్థానంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కొంతమంది సీనియర్లు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికలు కూడా ఆయన అధ్యక్షతనే జరుగుతాయని ఉత్తమ్ వర్గీయులు అంటుంటే, 2014లో జానారెడ్డి నేతృత్వంలో ఎన్నికలు వెళ్లుంటే ఫలితాలు మరోలా ఉండేవి అనే అభిప్రాయాన్ని జానా మద్దతుదారులు వ్యక్తీకరిస్తున్నారు. అంటే, వచ్చే ఎన్నికలు జానా అధ్యక్షతన జరగాలన్నది వారి అభిప్రాయం. సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి వంటి నాయకులు జానాకు మద్దతుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క, ఇదే పీసీసీ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కూడా పీసీసీపై కన్నేసిన సంగతి తెలిసిందే. అయితే, జానా కూడా ఇదే ప్రయత్నాల్లో ఉండటంతో వారు పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు. ఎందుకంటే, కోమటిరెడ్డి సోదరులకు ఉత్తమ్ కుమార్ నేతృత్వం ఇష్టం లేదు! కాబట్టే, తమకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలంటూ పట్టుదలతో ఉన్నారు. ఉత్తమ్ ను పీసీసీకి దూరం పెడితే వారు సంతృప్తిపడే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి, జానాకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం జానా ప్రయత్నాలపై కాస్త నారాజ్ గా ఉన్నట్టు సమాచారం! ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసుల ఉండాలన్న ఆశ ఆయనలోనూ ఉంది! ఇక, పొన్నాల విషయానికి వస్తే… బీసీ నేతనైన తనకు పార్టీలో గుర్తింపు ఏదనీ, పీసీసీ బాధ్యతల నుంచి తప్పించాక తనని పట్టించుకోవడం లేదంటూ ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా! ఆయన్ని కూడా జానా బుజ్జగించినట్టు చెబుతున్నారు. జీవన్ రెడ్డి కూడా జానాకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా ఛాన్స్ ఉంటే పీసీసీ తనకే వస్తుందన్నట్టుగా ఆయనా ఆశాభావంతో ఉన్నారట! ఆయనతో కూడా జానా మాట్లాడి, మద్దతు కోరబోతున్నట్టుగా చెబుతున్నారు. మొత్తానికి, రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జానా రెడ్డి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకోవాలి. మరి, జానా ప్రయత్నాలపై అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.