మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని సీనియర్ నేత జానారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీని జానారెడ్డి అసలెందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? ఆయన చేస్తున్న ఆరోపణలలో నిజమెంత? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోన్న చర్చ ఇదే.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ నేత జానారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని, జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నా, జానారెడ్డి అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో.. కోమటిరెడ్డికి మంత్రిపదవిని అడ్డుకోవాల్సిన అవసరం జానారెడ్డికి ఏముందనే చర్చ ప్రారంభమైంది. పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి. ఇదివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఆయన కనుసన్నలోనే కొనసాగాయి. కానీ , ఇప్పుడు మెజార్టీగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తున్నాయనే ప్రచారం కొన్నాళ్లుగా ఊపందుకుంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ లో వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా, మరొకరు మునుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే , జానారెడ్డి ఇద్దరు కుమారులు ఒకరు ఎమ్మెల్యే , మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తాయనే ,జానారెడ్డి అడ్డు తగులుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.