హైదరాబాద్: ‘నోరా వీపుకు దెబ్బలు తేకే’ అని ఒక నానుడి ఉంది. తెలంగాణ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి ఇప్పుడు ఆ నానుడి వర్తించేటట్లుగా ఉంది. జానారెడ్డి అసలు మొదటినుంచీ తేడా క్యాండిడేట్ అన్న సంగతి తెలిసిందే. ఆయన స్వరం ముద్ద ముద్దగా ఉండటంవలన ఏమి మాట్లాడుతున్నాడో ఎదుటివాళ్ళకు అర్థం కాకపోవటం అటుంచి, ఒక్కోసారి ఎందుకిలా మాట్లాడుతున్నాడనే సందేహాలు కూడా ఎదుటివారికి కలుగుతుంటాయి. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సొంతపార్టీ నేతలనే ఇరకాటంలో పడేశారు జానారెడ్డి.
నిన్న జానారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ మార్పు అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎందుకనిపించిందోగానీ, హైదరాబాద్‌లో పేదలకు జీహెచ్ఎంసీ అందిస్తున్న రు.5 భోజనం తినాలనిపించింది. నిన్న ఆ భోజనాన్ని తప్పించుకుని మీడియా సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డితో కలిసి తాను తినటమేకాక మీడియా ప్రతినిధులకు కూడా తినిపించారు. రుచిగా ఉందంటూ మెచ్చుకున్నారు. ఐదు రూపాయలకు అన్నం, కూర, సాంబారు ఇవ్వటం సబబుగా ఉందన్నారు. ఈ భోజనంపై ప్రతి ఐదు రూపాయలకు గానూ, జీహెచ్ఎంసీ రు.20 సబ్సిడీ భరిస్తుందని మీడియా ప్రతినిధులు చెబితే, రు.25కు ఎలాంటి భోజనం పెట్టొచ్చో జానారెడ్డి లెక్కలు వేసి మరీ చూపించారు. సబ్సిడీ భోజనం చేయాలన్న కోరిక ఎందుకు కలిగిందనే ప్రశ్నకు మాత్రం జానా నేరుగా సమాధానం చెప్పలేదు. అతి తక్కువ ధరకు లభిస్తున్న భోజనం ఎలా ఉందో చూద్దామనుకున్నానని చెప్పారు. మరోవైపు ప్రాజెక్టులపై కూడా జానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్ మార్చటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఆ ప్రాజెక్ట్ స్థానంలో గోదావరిపై చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టాలని జానా సూచించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రశంశలు గుప్పించారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న ఈ తరుణంలో జానారెడ్డి ఇలా ప్రభుత్వ పథకాన్ని పొగడటంపై కాంగ్రెస్ నేతలు లోలోపల రగిలిపోయారు. ఒకవైపు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ పథకాన్ని బాగా ప్రచారం చేసుకుంటుండగా జానా దానికి కితాబు ఇవ్వటమేమిటన మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దనరెడ్డి ఇవాళ మీడియాముందు స్పందించారు. జానారెడ్డి రు.5 భోజనానికి కితాబు ఇవ్వటం బాధాకరమని, ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. జానారెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను ప్రశంశించటం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ శాసనసభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంశించారు.