తెలంగాణా కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, శాసనసభ ప్రాంగణంలో గల ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. మరెవరూ లేకుండా వారిరువురే సుమారు అర్ధగంట సేపు మాట్లాడుకొన్నారు. రాజకీయంగా శత్రువులయిన వారిరువురు రహస్యంగా సమావేశం అవడంతో అప్పుడే మీడియాలో ఊహాగానాలు మొదలయిపోయాయి.
ప్రస్తుతం తెలంగాణా తెదేపా కాంగ్రెస్ పార్టీల పరిస్థితి దాదాపు ఒకేలాగ ఉంది. రెండు పార్టీలు కూడా తెరాస బాధితులే కనుక వారిరువురు తెరాసని ఏవిధంగా ఎదుర్కోవచ్చనే అంశంపై చర్చించి ఉండవచ్చునని భావిస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే వారు సమావేశమయినట్లు తెలుస్తోంది. అంటే ఓటుకి నోటు కేసు గురించి వారు తమ సమావేశంలో చర్చించి ఉండవచ్చును. వారిద్దరిలో ఎవరూ తమ సమావేశ వివరాలను బయటపెట్టక పోవడంతో వారు దేని గురించి సమావేశమయ్యరనే విషయం ఖచ్చితంగా తెలియదు.
క్రితం తెరాసను అడ్డుకొనేందుకు అవసరమయితే తెదేపాతో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన కొన్ని రోజుల ప్రకటించారు. తెరాసను నిలువరించాలని తెదేపా భావిస్తున్నట్లయితే తెలంగాణా తెదేపా నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక కాంగ్రెస్ నేత పిలుపునిచ్చారు. తెలంగాణాలో ఎలాగూ తెదేపా పూర్తిగా కనుమరుగయిపోతోంది కనుక, తెలంగాణా నుండి గౌరవప్రదంగా బయటపడాలంటే మిగిలిన తెదేపా నేతలను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీకి అప్పగించడమే మంచి మార్గంగా కనబడుతోంది. తద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడుతుంది. తెరాసకు ఎదురు నిలువగలుగుతుంది. తెలంగాణాలో తెదేపాను తుడిచిపెట్టేసినందుకు ఆవిధంగా దానిపై తెదేపా ప్రతీకారం తీర్చుకోవచ్చును.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే, ఆంధ్రప్రదేశ్ లో తెదేపాకి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదురవవచ్చును. కనుక జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది. తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్య త్వరలో జరుగబోయే ప్రతిక్రియలను బట్టి వారిరువురూ దేని గురించి చర్చించుకొన్నారో ఊహించవచ్చును.