త్వరలోనే కాంగ్రెస్‌లోకి బాహుబలి వస్తాడు.. కొన్ని మాసాల కిందట తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్న ఈ మాట రాజకీయంగా చాలా చర్చలకు దారి తీసింది. టిఆర్ఎస్లో అందరికన్నా ఎత్తుండే ఆజానుబాహుబలి అయిన ప్రముఖ మంత్రిని దృష్టిలో పెట్టుకుని ఆయన అలా అన్నారని చాలామంది వ్యాఖ్యానించారు. ఏమైనా ఎవరో వస్తే తప్ప కాంగ్రెస్ గట్టెక్కలేదన్నమాట అని టిఆర్ఎస్ నేతలు అపహాస్యం చేశారు కూడా. తర్వాత జానా మాటలు మరుగున పడిపోయాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం గురించిన కథనాలు మొదలైనాక కొంతమంది ఆ బాహుబలి తనేనని ప్రచారం ఎత్తుకున్నారు. అయితే సాక్షాత్తూ జానానే ఆ కథనాల గాలి తీసేశారు. పార్టీలోకి రాగానే ఎవరూ బాహుబలులై పోరని ఎన్నికల్లో గెలిపించేవారే ఆ గౌరవం పొందుతారని స్పష్టం చేశారు. పేరు చెప్పకపోయినా ఇవి రేవంత్‌కు తగిలే మాటలనేనని అందరికీ తెలుసు. రేవంత్ రాకతోనే గెలిచే అవకాశం లేదన్న సంకేతం కూడా జానా ఇచ్చారు. తన పరిస్థితిని కూడా తనే చక్కగా చెప్పుకున్నారు. నేను కాంగ్రెస్ అద్వానీని అంటే ముఖ్యమంత్రి పదవి అడగకుండా అలాగే వుంటాను అని ముక్తాయించారు. తనను ఆ పదవికి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల నాటికి పార్టీని సిద్ధం చేయడానికి ఖర్చు చేస్తానని కష్టపడతానని ఆయన సన్నిహితుల దగ్గర అంటూనే వున్నారు. మరి ఇప్పుడు ఇలా వైరాగ్యం చూపించడానికి కారణం ఏమిటి?