జనసేనానుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి పరీక్షలు నిర్వహించడం కొంత వింతగానే వుంది. పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షణ అభిమానం కారణంగా చాలామంది ఆ పార్టీ గురించి ఆలోచిస్తుండొచ్చు. ఎన్నికల్లో టికెట్లు కూడా ఆశిస్తుండవచ్చు. అయితే అదంతా తర్వాత. ముందు ప్రారంభ కార్యక్రమాలకు కార్యకర్తలు కావాలి. కార్యక్రమాలు చేస్తే కార్యకర్తలు దొరుకుతారు. అంతేగాని పరీక్షలు ఆబ్జెక్టివ్ జవాబుల ద్వారా తేలడం కష్టం.ఎవరైనా ఒకరు అరా వుండొచ్చునేమో గాని ఫ్రధానంగా కార్యక్షేత్రంలోనే ఇది తేలుతుంది. ఢిల్లీలో ఆప్ మధ్యతరగతి బుద్ధి జీవుల భాగస్వామ్యంతో కొత్త తరహాలోనే మొదలైంది. రెండు సార్లు విజయం సాధించింది కూడా. కాని అనుభవ రాహిత్యం వల్ల ఆదుర్దా వల్ల ఏమైంది? ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సహా గందరగోళానికి గురైన పరిస్థితి. చివరకు ఇప్పుడు వారిమీద విశ్వాసాన్నే సన్నగిల్లజేసేలా మునిసిపల్ ఫలితాలు.ఆ పిమ్మట మళ్లీ శిక్షణా చర్యలు తిరుగుబాట్లు వివాదాలు ఎన్నెన్నో! అన్న చిరంజీవి ప్రజారాజ్యం అనుభవం కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. కాకుంటే ఆయనకు పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్లే గాక అనుభవజ్ఞులైన అనేకమంది సలహాదార్లువుండేవారు. డా.మిత్రా, పరకాల ప్రభాకర్, డా.వినయకుమార్, పి.శివశంకర్, హరిరామ జోగయ్య కృష్ణం రాజు తదితరులంతా చేరారు. అసలు ఎన్నికలకు ముందే వీరిలో చాలా మంది దూరం కాగా తర్వాత కొందరు వెళ్లిపోయారు.చివరకు ఆ పార్టీయే కాంగ్రెస్‌లో కలసిపోయింది. కాని మొదట్లొ వారు కూడా రాజకీయ తరగతులంటూ పెద్ద కసరత్తే నడిపించారు. సమస్య ఏమంటే ఉద్యమాలూ సమీకరణల క్రమంలో కార్యకర్తలు దొరుకుతారు గాని ఆఫీసుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలకు వచ్చినట్టు వచ్చేవారు ఆట్టే అక్కరకు రారు.ఈ విషయంలో లోక్‌సత్తా అనుభవం కూడా వుంది. అన్నీ వున్నా పవన్ మాత్రం దరఖాస్తులు తెప్పించి పరీక్షలు పెట్టి అనలిస్టులను, రైటర్లను ఎంపిక చేసుకుంటామనడం సినిమా తయారీలా వుంది!