కులాల ఐక్యత తమ ప్రధాన అజెండా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ ఐక్యత పేరుతో పదేపదే కులాల పేర్లను బహిరంగ సభల్లో ప్రస్థావిస్తున్న తీరు చూస్తున్నాం. దీంతోపాటు, ఇప్పుడు మతాల ప్రస్థావన కూడా తెచ్చే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో పవన్ మాటలు గమనిస్తే… ఆయన విమర్శించింది ప్రతిపక్ష నేగ జన్మోహన్ రెడ్డినే అయినా, ఈ క్రమంలో మతాల ప్రస్థావన తీసుకొచ్చారు. జగన్ ఎప్పుడూ బైబిల్ పట్టుకుని తిరుగుతారనీ, జీసస్ ని గుండెలకి హత్తుకుంటారనీ, కానీ చర్చిల దగ్గరున్న మద్యం దుకారణాలు మూయించమని ఎందుకు మాట్లాడరంటూ పవన్ ప్రశ్నించారు. భారత్ మాతాకి జై అని కూడా జగన్ అనరు అన్నారు. ఆ మాట అనే హక్కు కేవలం భాజపాకి మాత్రమే ఉందా, వారేమన్నా పేటెంట్ తీసుకున్నారా అంటూ నిలదీశారు.
రెండ్రోజుల కిందట కాకినాడలో ముస్లింలతో మాట్లాడుతూ, ప్రసంగంలో చోట భాజపా గురించి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తాను భాజపాతో దోస్తీ చేయడాన్ని ఆ మధ్య ఒక న్యాయవాది తీవ్రంగా తప్పుబట్టారనీ, భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమేననీ, అది హిందువుల సొంతం కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క మతానికీ అండగా ఉండదన్నారు. భాజపా, కాంగ్రెస్ రెండు పార్టీలకూ కళంకిత చరిత్ర ఉందన్నారు. భాజపాని హిందుత్వ పార్టీ అని విమర్శించే కాంగ్రెస్ మీద… సిక్కుల ఊచకోతల కేసులున్నాయన్నారు. తన ఎదుట ఎవరైనా ముస్లింలను తక్కువగా చూస్తే ఊరుకునేది లేదన్నారు. తాను హిందూ ధర్మాన్ని నమ్ముతాననీ, అందరినీ సమానంగా చూడటమే హిందూ ధర్మమనీ ఆరోజు చెప్పారు.
కాకినాడలతో ఒక మతం ప్రస్థావన, రాజమహేంద్రవరంలో మరో మతం ప్రస్థావన.. ఇది పవన్ అవసరమా..? ఏ మత ధర్మాలు ఏం చెబుతున్నాయో నిర్వచించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఏముంటుంది..? ఈ క్రమంలో భాజపా భావజాలాన్ని వెనకేసుకొస్తున్న ధోరణలు పవన్ లో కనిపిస్తున్నాయా లేదా..? జగన్ మీద తాజాగా మతం పేరుతో విమర్శించిన వైకాపాగానీ, ప్రతీరోజూ రొటీన్ గా ఆయన విరుచుకుపడే టీడీపీగానీ… మత ప్రస్థావనను ఇలా బహిరంగ సభల్లో తేవడం లేదే..!
తాను అంబేద్కర్ ఆశయాలను గుండెల నిండా నింపుకుని అర్థం చేసుకున్నాననీ, లౌకిక విలువల్ని పాటిస్తానని పవన్ చెబుతారే..! మరి, ఇలా బహిరంగ సభావేదికల మీద మాట్లాడుతున్నప్పుడు కుల ప్రస్థావనలు తీసుకుని రావడం ఎంతవరకూ సబబు..? మత ప్రమేయం లేని రాజ్యమే లౌకిక రాజ్యం అంటూ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘లౌకిక రాజ్యం’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగకర్తలే మత ప్రమేయం ఉండకూడదని చెప్పారు కదా, మరి బహిరంగ వేదికల మీద ఇలాంటి ప్రస్థావనలు చేయడం ఏరకమైన స్ఫూర్తో పవన్ కల్యాణ్ ప్రజలకు చెప్పాలి..?