వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖలో తేల్చి చెప్పారు. వారాహి యాత్ర సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ, జనసేన కూటమిగా వెళ్తుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్తుందా అన్నదానిపై ఇంకా చర్చలు పూర్తి కాలేదన్నారు. త్వరలో ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తాను ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. ముఖ్యమంత్రి పదవి వస్తే తీసుకోవడనికి సిద్ధమన్నారు. అయితే అది బలాబలాలను బట్టి నిర్ణయం అవుతుందని.. ఎన్నికల తర్వాతే ఈ అంశంపై మాట్లాడతామన్నారు. పొత్తుల విషయంలో కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. కానీ బీజేపీ, వైసీపీ మధ్య గాఢమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని వదులుకునేందుకు బీజేపీ సిద్ధపడటం లేదు. అడ్డగోలు పరిపాలనకు అన్ని విధాలుగా బీజేపీ సహకరిస్తోంది. బీజేపీతో ఈ అనబంధం తెంచడానికి జనసేనాని ప్రయత్నిస్తున్నారు. అయితే సొంత పార్టీ కన్నా బీజేపీకి.. వైసీపీనే ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారింది.. ఇక జనసేనను పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా పవన్ కల్యాణ్.. బీజేపీని ఒప్పిస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరో వైపు టీడీపీ పొత్తుల అంశంపై ఎక్కడా ప్రకటనలు చేయడం లేదు. వస్తే వచ్చారు లేకపోతే లేదన్నట్లుగా తమ పని తాము చేసుకుపోతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయన త్వరగా ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇలా పొత్తులపై రోజుకో మాట చెప్పడం వల్ల.. జనసైనికుల్లోనూ గందరగోళం ఏర్పడుతుందన్న ఆందోళనలో ఉన్నారు.