జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహుర్తం ఖరారయింది. ఈ నెల 14వ తేదీన అన్నవరంలో పూజలు చేసి వైఎస్ఆర్సీపీపై దండయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా తొలి విడత రూట్ మ్యాప్ ను జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ మనోహర్ ప్రకటించారు. తొలి విడత యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరగనుంది. ప్రత్తిపాడు. పిఠాపురం కాకినాడ రూరల్, రాజోలు , నర్సాపురం ఇలా అన్న వరం నుంచి భీమవరం వరకూ యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా ప్రతీ రోజూ..ఓ చోట్ల ఫీల్డ్ విజిట్ ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. వాహనం రెడీ అయి ఆరు నెలలు అవుతుంది. అయితే గతంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న కారణంగా వాహనాన్ని రెడీ చేయించుకున్నరు. కానీ ముందస్తుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో పవన్ యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికుల దగ్గర పడటం.. తెలంగాణతో పాటు ఏపీకి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ప్రారంభం కావడంతో.. సినిమాలకు టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.., రాజకీయ యాత్రల కోసం సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పవన్ తమకు బలం ఉన్న స్థానాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీకి బలం ఉన్న జిల్లాల్లోనే ఎక్కువగా పర్యటించాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. అయితే వారాహి రాష్ట్రమంతటా తిరుగుతుందని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.