జనసేన అధినేత పవన్ కల్యాణ్… తన అభ్యర్థులుగా సామాన్యుల్ని నిలిపారు అయితే.. వారేమీ బలహీనమైన అభ్యర్థులు కాదు. ఆయా నియోజకవర్గ సమీకరణాలను లెక్క తేలిస్తే.. వారు గెలుపోటముల్ని శాసించే పరిస్థితిలో ఉన్నారు. చాలా చోట్ల… గెలుపొందడానికి రేసులో కూడా ఉన్నారు. కృష్ణా జిల్లాలో కనీసం.. ఏడు చోట్ల… జనసేన అభ్యర్థులు.. టీడీపీ, వైసీపీతో హోరాహీరోగా తలపడుతున్నారు.
విజయవాడలో మూడు అసెంబ్లీ స్థానాలుంటే.. ప్రజారాజ్యం పార్టీ అందులో రెండు స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు.. జనసేన రంగంలోకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీలానే…జనసేన కూడా బలంగానే కనిపిస్తోంది. విజయవాడ పశ్చిమ నుంచి బరిలో ఉన్న పోతిన వెంకట మహేష్ ప్రచారంలో తీవ్రం కష్టపడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా షబానా ఖాతూన్ బరిలో ఉండగా, వైసీపీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి పోతిన మహేష్ పోటీ చేస్తున్నారు. నగరాల సామాజికవర్గానికి చెందిన పోతిన మహేష్ ఆ ఓట్లను గణనీయంగా రాబట్టుకోవడంతోపాటు ఇతర సామాజికవర్గాల ఓటర్లనూ పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ తూర్పులోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సుమారు 2.50 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో కాపు సామాజికవర్గం ఓట్లు 50 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్, వైసీపీ తరఫున బొప్పన భవకుమార్ బరిలో ఉన్నారు. వీరిద్దరిదీ కమ్మ సామాజికవర్గం. జనసేన ఇక్కడ వ్యూహాత్మకంగా కాపు సామాజికవర్గానికి చెందిన బత్తిన రాముకు టికెట్ ఇచ్చింది. అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.
అవనిగడ్డలో టీడీపీ తరఫున ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే. జనసేన కాపు సామాజికవర్గానికే చెందిన ముత్తంశెట్టి కృష్ణారావుకు టికెట్ ఇచ్చింది. ఆయన కూడా బలమైన అభ్యర్థేనని.. తాజా రాజకీయ పరిస్థితులు నిరూపిస్తున్నారు. నూజివీడులో టీడీపీ తరఫున ముద్దరబోయిన, వైసీపీ నుంచి మేకా ప్రతాప్ అప్పారావు పోటీ చేస్తుండగా జనసేన తరఫున బసవా భాస్కరరావు పోటీ చేస్తున్నారు. నిన్నామొన్నటి దాకా బసవా భాస్కరరావు వైసీపీలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న తన భార్య బసవా రేవతి పదవి పోవడానికి మేకా ప్రతాప్ అప్పారావు కారణమన్న ఉద్దేశంతో భాస్కరరావు జనసేన తరఫున టికెట్ తెచ్చుకుని బరిలో నిలిచారు. నూజివీడు పట్టణంలో బలమైన అనుచరవర్గం ఉంది. గెలుపును మార్చడమే కాదు… గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంంటున్నారు.
కైకకూలులో.. జనసేన అధినేత నిర్వహించిన ప్రచారసభకు.. యువత పెద్ద సంఖ్యలో వచ్చారు. జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న బీవీరావు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. కైకలూరులో టీడీపీ అభ్యర్థిగా జయమంగళం వెంకటరమణ, వైసీపీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. కాపు సామాజికవర్గం ఓట్లపై నాగేశ్వరరావు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ కాపు, బీసీ ఓట్ల మ్యాజిక్‌తో బీవీ రావు రేసులోకి వచ్చారు. పెడనలో టీడీపీ, వైసీపీ, జనసేన తరఫున బరిలో ఉన్న వారంతా బీసీ సామాజికవర్గానికి చెందినవారే. ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లతోపాటు కాపు ఓట్లూ గణనీయంగా ఉన్నాయి. దీంతో ఆ సామాజికవర్గం ఓట్లపై వైసీపీ నాయకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఆ ఓట్లలో అధికశాతం జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న అంకెం లక్ష్మీ శ్రీనివాస్ ఖాతాలో పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ వర్గీయుల్లో గుబులు రేగుతోంది