జనసేన నేత నాగేంద్ర బాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుకు హైదరాబాద్ లో ఓటుహక్కు ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఏపీలో ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డోర్ నెంబర్ లో విచారణ చేయగా తాళం వేసి ఉంది. దాంతో బూత్ లెవల్ ఆఫీసర్ పక్కన ఇంటి వారికి సమాచారం అందించారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబును తమ వద్ద హాజరు కావాలని బీఎల్వో నోటీసు ఇచ్చారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో నాగబాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుందని, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని వైసీపీ ఆరోపణలు ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగబాబు కుటుంబం ఓటు వేసిందని.. పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు (సీరియల్ నెంబర్- 323), కొణిదెల పద్మజ (సీరియల్నెంబర్- 324), వరుణ్ తేజ్ (సీరియల్ నెంబర్ – 325) ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ఆరోపించింది. తెలంగాణలో ఓటు ఉండగా, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
పైగా తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేసిన జనసేన నేత ఏపీలో నాగేంద్రబాబుగా మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను ఆ పార్టీ పోస్ట్ చేసింది. నీతులు పక్క వాళ్లకు చెప్పడమేనా, మీరు ఏం పాటించడం లేదా అని వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనికి జనసేన వైపు నుంచి కౌంటర్ రావాల్సి ఉంది.