ఒక టీవీ చానల్ చేతిలో ఉండాలన్న ఆకాంక్షను..జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. కొంత కాలం చర్చలు జరిపి.. జరిపి చివరికి 99టీవీతో డీల్ సెట్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ 99టీవీ.. కమ్యూనిస్టుల చేతుల్లో ఉంది. సీపీఐకి చెందిన చానల్. కానీ ఆర్థిక భారం కారణంగా.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతోంది. దీన్ని బెయిలవుట్ చేసి.. పూర్తి స్థాయిలో టేకోవర్ చేసేలా.. పవన్ కల్యాణ్ సన్నిహితులు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. బుధవారమే.. ఈ టీవీ చానల్ ఆఫీసులో… జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ వెంటనే జనసేన పార్టీ దూసుకుపోతోందంటూ.. ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసి.. ప్రసారం కాబోయే కంటెంట్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత చానల్ పేరు కూడా మారే అవకాశం ఉందంటున్నారు.
అయితే పవన్ కల్యాణ్ నేరుగా ఈ టీవీచానల్ను టేకోవర్ చేయలేదు. న్యూస్ వేవ్ మీడియా పేరుతో.. ఉన్న సంస్థ ఈ చానల్‌ను నడుపనుంది. టీవీ ఆఫీసులో తోట చంద్రశేఖర్… పూజలు చేశారు కాబట్టి.. ఆయన పెట్టుబడి పెట్టి ఉంటారన్న అంచనాలు కూడా ఉంటాయి. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఓనర్ అయిన తోట చంద్రశేఖర్ .. మాజీ ఐపీఎస్ అధికారి. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఈయనపై సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. ముందుగానే సర్వీస్ నుంచి వైదొలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. ఇప్పుడు జనసేనకు వచ్చారు. తోట చంద్రశేఖర్‌తో పాటు.. నోవా విద్యాసంస్థలను నడుపుతున్న ముత్తంశెట్టి విజయనిర్మల కూడా పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె చాలా రోజులుగా జనసేనలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు.
మీడియా తనపై శీతకన్ను వేస్తోందని.. భావిస్తున్న పవన్ కల్యాణ్ తన పార్టీకి సొంత టీవీచానల్ ఉండాలని.. కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఇప్పుడు నెర వేరినట్లయింది. తెలుగులో ఇబ్బడిమబ్బడిగా పుట్టుకు వచ్చిన న్యూస్ చానల్స్‌కు ఇటీవలి కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి. ఎన్నికల పుణ్యమా..అని..జనసేన ఆవిర్భావం కారణంగా.. రెండు, మూడు చానళ్లకు కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్క టీవీ చానల్ మాత్రమే కాకుండా.. మరో కమ్యూనిస్టుల చానల్ టెన్ టీవీ తోనూ…జనసేన వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.