2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది జనసేన. ఆంధ్రాలోని 175 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీకి సంబంధించిన నిర్ణయాన్ని ఆగస్టులో తీసుకుంటామన్నారు. ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం తనకు లేకపోయినా, జనసేన కార్యకర్తలకు రెండు ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందనీ, దీనికి సంబంధించిన వివరాలను ఈ నెల 11న వెల్లడిస్తానని పవన్ అన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధం చేస్తామన్నారు. గడచిన రెండ్రోజులుగా జిల్లాలకు చెందిన కార్యకర్తలూ నాయకులతో పవన్ భేటీ అయ్యారనీ, ఎన్నికల్లో పోటీ అంశమై చర్చించాకనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్ని స్థానాల్లో పోటీకి దిగబోతున్నామనేది ప్రకటిస్తానని ఆ మధ్య పవన్ చెప్పారు. అంతవరకూ ప్రజల్లో ఉండి, తమ బలమెంతో ఒక అంచనాకు వచ్చిన తరువాత, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలం కదా అన్నారు. మరి, ఆర్నెల్ల ముందే 175 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారంటే… జనసేన బలంపై వారికి వచ్చిన అంచనా ఏంటో వారికే తెలియాలి. ఇక, అన్ని స్థానాల్లో జనసేన పోటీ అంటే… ఇతర పార్టీలతో పొత్తు ఉండదనే సంకేతాలు ఇచ్చినట్టే భావించాలి. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అలా అయితే, గడచిన నాలుగు నెలలుగా వామపక్షాలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కదా! మరి, తాజా ప్రకటనతో వారి భవిష్యత్తు డోలాయమానంలో పడేసినట్టే కదా!
నిజానికి, వచ్చే ఎన్నికల్లో 70 నుంచి 80 అసెంబ్లీ… 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో జనసేన ఉండేది. కానీ, ఈ మధ్య అధికార పార్టీ టీడీపీకి ఎదురు తిరగడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో జనసేన అనూహ్యంగా బలం పుంజుకుందనే విశ్లేషణలో వారున్నట్టు తెలుస్తోంది. అందుకే, అన్ని స్థానాలకూ పోటీ అని ప్రకటించేయడం ద్వారా… ఎవరి డైరెక్షన్లోనో పవన్ నడుస్తున్నారనే విమర్శను ఇక్కడి నుంచే కొట్టి పారెయ్యొచ్చన్నది వారి అంచనా. ఆంధ్రాలో 175 స్థానాల్లో పోటీ… వినడానికి బాగానే ఉంది. కానీ, పార్టీ నిర్మాణమేదీ, కమిటీలేవీ, అభ్యర్థులు ఎవరు, ద్వితీయ స్థాయి నాయకత్వమేదీ… గడచిన నాలుగేళ్లుగా ఈ పనులేవీ ప్రణాళికాబద్ధంగా సాగలేదు. అన్నిటికీమించి, ఈ డిసెంబర్ వరకూ ప్రజల్లో ఉండి, ఆ తరువాత జనసేన బలాన్ని అంచనా వేసుకుంటానని ఆ మధ్య ప్రకటించి.. అలాంటి కసరత్తు ఏదీ జరగకుండా ఏకంగా ఎన్నికలకు సిద్ధమని పవన్ ప్రకటించడం అనూహ్యమో, అత్సుత్సాహహో, అద్భుతమో… కాలమే చెబుతుంది!