జనసేన పార్టీ జనంలోకి వెళ్లే ప్రయత్నం ఇన్నాళ్లకి మెల్లగా మొదలుపెట్టిందని చెప్పాలి! ఇంతవరకూ ఏకవ్యక్తి పార్టీగానే జనసేన ఉంది. ఇప్పుడూ అలానే ఉంది! పవన్ వస్తేనే సభలు ఉంటాయి, ఆయన మాట్లాడితేనే స్పందన ఉంటుంది, ఆయన ట్వీట్ చేస్తేనే చర్చ అన్నట్టుగా… పార్టీ నిర్మాణం అంతా పవన్ చుట్టూనే పరిభ్రమిస్తూ వస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నాం అని పవన్ ప్రకటించేశారు. కానీ, సమరానికి కావాల్సిన సంసిద్ధత, సైన్యం ఎక్కడుందనేది ఇంకా క్వశ్చన్ మార్కుగానే ఉంది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఇప్పటికీ మొదలుకాలేదు. క్షేత్రస్థాయి నుంచి బాధ్యతల పంపకాలు ఇంకా జరగలేదు. అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చుకునే వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఒక కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది..!
ప్రతీ జిల్లాలోనూ పార్టీ తరఫున ఒక స్పీకర్, కంటెంట్ రైటర్, విశ్లేషకులు కావాలంటూ ఓ ప్రకటన పవన్ కల్యాణ్ పేరుతో విడుదలైంది. అనంతపురం జిల్లా నుంచీ ఈ నియామకాలు శ్రీకారం చుడుతున్నారు. ఇలా నియమితులైనవారు ఆయా జిల్లాల్లో సమస్యలపై అధ్యయనం చేయాలి. కంటెంట్ పార్టీకి అందించాలి. సోషల్ మీడియా ద్వారా, లేదా ఇతర మాధ్యమాల ద్వారా వీరు ప్రజలకు టచ్ లో ఉండాలి. రైటర్, స్పీకర్, విశ్లేషకుడు… అంతా పక్కా సినిమాటిక్ ప్లాన్ గా ఉంది. వీరిని ఎంపిక చేసేందుకు హైదరాబాద్ నుంచి ఒక బృందం జిల్లాల్లో పర్యటిస్తుంది. ఒకసారి వీరి నియామకం జరిగిన తరువాత… ఆయా జిల్లాల్లో పార్టీకి సంబంధించిన కొన్ని కీలక బాధ్యతలు ఒక్కో టీమ్ కి అప్పగిస్తూ వస్తారని సమాచారం.
ఆలోచనగా చూస్తే ఈ నియామక ప్రక్రియ బాగానే కనిపిస్తోంది. కానీ, ఆచరణాత్మక కోణం నుంచి ఆలోచిస్తే.. ఇది వర్కౌట్ అవుతుందా అనే అనుమానం వ్యక్తమౌతోంది. ఎందుకంటే, పవన్ కల్యాణ్ వస్తేనే జనాలు ఎక్కడికైనా వస్తున్నారు. పవన్ చెబితేనే ఏదైనా వింటున్నారు. అంతేగానీ, ఎవరో ఒక ఎనలిస్టో, ఏ అనామక స్పీకరో ఎక్కడో చోట మాట్లాడితే జనాలికి ఎక్కుతుందా..? పెద్దపెద్ద పార్టీలే జనసమీకరణకు నానా తంటాలూ పడుతూ ఉంటాయి. డబ్బులు దండిగా వెదజల్లితే తప్ప సభా ప్రాంగణాలు నింపుకోలేని పరిస్థితి..! ఇలాంటి వాతావరణంలో ఎవరో ఒక స్పీకర్ మాట్లాడితే… ఒక రైటర్ ఏదో రాస్తే… ఒక అనలిస్టు ఏదో విశ్లేషిస్తే అవి జనాల్లోకి ప్రభావవంతంగా వెళ్తాయా అనేది ప్రశ్న..?
నిజానికి, ఎన్నికలకు సంసిద్ధమయ్యే తీరు ఇది కాదనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమౌతోంది. ఏపీ మీడియాలో ఒక వర్గం ప్రస్తుతానికి పవన్ ను భుజానకెత్తుకునే ప్రయత్నంలో ఉన్నా… దీర్ఘకాలంలో వారి రాజకీయ ప్రయోజనాలు ఎలా మారతాయో అనేది పవన్ అర్థం చేసుకోవాలి! సో… దానిపై ఆధారపడకూడదు. పార్టీలో ద్వితీయ శ్రేణిపై దృష్టి పెట్టాలి. పవన్ తరువాత స్థాయిలో బాధ్యతలు ఎవరు పంచుకునేది ఎవరో… పార్టీలోకి ఎలాంటి నాయకులు వస్తారో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇంతకీ పవన్ ఎవర్ని చేర్చుకుంటారో, ఎలాంటి అర్హతల కోసం చూస్తున్నారనే సంకేతాలు కూడా లేవు. సో… ముందుగా పవన్ కల్యాణ్ దృష్టి సారించాల్సిన అంశాలు ఇవి.